సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణకు సహకరించాలని కోరుతూ గడ్కరీకి మందకృష్ణ మంగళవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ వర్గీకరణ ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశమని, తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అవసరం ఉందని చెప్పారన్నారు.
అంతేగాకుండా ఈ విషయంలో వ్యక్తిగత చొరవ తీసుకొని వర్గీకరణకు సహకరిస్తామని హామీ ఇచ్చారని మందకృష్ణ పేర్కొన్నారు. గడ్కరీని కలసిన వారిలో బీజేపీ జాతీయ నేత జి.కిషన్‌రెడ్డి, దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులున్నారు.