నాన్నను చూసి వస్తాను.. అనుమతివ్వండి!
ఆమె తండ్రి పాకిస్థాన్‌లో చావుబతుకుల మధ్య ఉన్నాడు. 80 ఏళ్ల ఆయనను ఒక్కసారి చూసి వచ్చేందుకు ఓ కూతురు తపిస్తోంది. ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది.
ఆమెనే ఇరామ్ సయర్. ఆమె భర్త ఓ మాజీ కశ్మీర్ మిలిటెంట్. పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన ఈ దంపతులు 2012లో నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం కశ్మీర్‌లో నివాసముంటున్నారు. అయితే నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చేసమయంలో వీరి పాస్‌పోర్టు, ఇతర పత్రాలను నేపాల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సాంకేతికంగా ఈ దంపతులు ఇటు భారత్‌గానీ, అటు పాకిస్థాన్‌గానీ చెందిన వారు కాకపోవడంతో రావాల్పిండిలోని తన తండ్రిని చివరిసారి చూసుకొని రావడానికి ఆమె అనుమతి లభించడం లేదు.
ఇదే విషయమై ఇరామ్ సయ్యర్ తాజాగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీని కలిసి విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మెహబుబా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాజ్‌నాథ్ శ్రీనగర్‌కు రానున్నారు. ఇరామ్ భర్త సయర్ అహ్మద్ లోన్ 2001లో మిలిటెంట్‌గా మారి ఎల్‌వోసీ దాటి కశ్మీర్ చేరుకున్నాడు. 2007లో రావల్పిండికి చెందిన ఇరామ్‌ను పెళ్లిచేసుకున్నాడు. సయర్ ఇటీవల మిలిటెంట్ నుంచి పరివర్తన చెందాడు. మెహబూబా ప్రభుత్వం మాజీ మిలిటెంట్లకు పునరావాస పథకం ప్రకటించడంతో అతను తిరిగి కశ్మీర్ వచ్చి నివసిస్తున్నాడు. అయితే 80 ఏళ్ల తన తండ్రి కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతో చికిత్స పొందుతున్నాడని, చావుబతుకుల మధ్య ఉన్న ఆయనను చివరిచూసి వచ్చేందుకు మానవతా దృక్పథంతో అనుమతి ఇవ్వాలని సీఎం మెహబాబాను కోరినట్టు ఇరామ్ సయర్ తెలిపారు.