
అధ్వానంగా డైట్, సీటీఈ కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కాలేజీలు అధ్యాపకుల్లేక అధ్వానంగా తయారయ్యాయని, బోధన దెబ్బతిందని ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్), కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ) కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా శిక్షణ కాలేజీల పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ జాయింట్ రివ్యూ మిషన్ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ఉపాధ్యాయ విద్యా కాలేజీల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.
కాలేజీల్లో పరిస్థితి, బోధన, బోధనేతర సిబ్బంది కొరత, వసతులు తదితర అంశాలపై చర్చించారు. అయితే అధ్యాపకుల నియామకాలు లేక డైట్, సీటీఈల్లో బోధించేవారు లేకుండా పోయారని ప్రిన్సిపాళ్లు పేర్కొనట్లు తెలిసింది. పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని, భవిష్యత్తులో ఉపాధ్యాయులయ్యే అభ్యర్థులకే బోధించే వారు కరువయ్యారని వివరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేంద్ర జాయింట్ రివ్యూ మిషన్ (జేఆర్‌ఎం) బృందం జిల్లాల్లో పర్యటించి కాలేజీల పరిస్థితిని తెలుసుకోనుంది. ఇందులో భాగంగా ఈనెల 12న కరీంనగర్, 13వ తేదీన వరంగల్ జిల్లాల్లోని డైట్, సీటీఈలను సందర్శించే అవకాశం ఉంది.
జేఆర్‌ఎం బృందానికి సమస్యల స్వాగతం
రాష్ట్రంలో 10 జిల్లా ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ (డైట్)లు, 3 బీఎడ్ కాలేజీలు, ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఐఏఎస్‌ఈ) ఉన్నాయి. వాటిల్లో 375 మంజూరైన పోస్టులు ఉండగా, 77 పోస్టుల్లోనే అధ్యాపకులు ఉన్నారు. మరో 298 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. ఇక ఎస్‌సీఈఆర్‌టీలోనైతే 32 పోస్టులు ఉంటే 27 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం ఒక్క ప్రొఫెసర్, ముగ్గురు లెక్చరర్లు, తాత్కాలిక సిబ్బందితో పరిశోధనలను మమ అనిపించేస్తోంది.
హైదరాబాద్‌లోని డైట్‌లో ప్రిన్సిపాల్ సహా 30 మంది అధ్యాపకులు పని చేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, తాత్కాలిక సిబ్బందితోనే ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశామనిపించేస్తున్నారు. ఆదిలాబాద్ డైట్‌లో 24 మంది పని చేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. మెదక్ డైట్‌లో 30 మంది ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురే పని చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అయితే ఐదుగురు చొప్పున అధ్యాపకులతో డైట్‌లు కొనసాగుతున్నాయి.
నాగార్జునసాగర్‌లోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలో ఒక్కరే ఉండగా, మహబూబ్‌నగర్ బీఎడ్ కాలేజీలో నలుగురు, వరంగల్ బీఎడ్ కాలేజీలో ఆరుగురే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఇక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ వర్సిటీల్లోని బీఎడ్ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీని పట్టించుకున్న వారు లేరు. ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నదే అరకొర అయితే అందులోనూ 19 మంది అధ్యాపకులు ఉప విద్యాధికారిగా డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు.