నవీ ముంబై: నగరంలో తయారుచేసిన మహిళల చెప్పులను అమెరికాలోని న్యూయార్క్ కు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన కంటైనర్ లో ఓ యువకుడిని ఉంచి మూసేశారు. శనివారం సాయంత్రం కంటైనర్ ను షిప్పింగ్ కోసం తరలిస్తున్న సమయంలో పెద్దగా కేకలు వేస్తూ కంటైనర్ గోడల మీద కొడుతున్నట్లు శబ్దం వస్తుండటంతో అనుమానించిన అధికారులు కంటైనర్ ను తెరచి చూసి యువకుడిని రక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరా రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ షూ కంపెనీలో పనిచేసే ఓ వర్కర్ 555 షూ కార్టన్లను కంటైనర్ లో సర్ధి అక్కడే నిద్రపోయాడు. దీంతో కంటైనర్ ను నింపడం పూర్తయిందని భావించిన కంపెనీ అధికారులు కంటైనర్ డోర్లను మూసేసి శనివారం ఉదయం నవీ ముంబైలోని పోర్టుకు పంపారు. సాయంత్రం కంటైనర్ ను షిప్ లోనికి తరలించేముందు లోపలి నుంచి శబ్దాలు వస్తుండటంతో కస్టమ్స్ అధికారులు కంటైనర్ ను తెరచి యువకుడిని రక్షించారు.
కార్గో షిప్ న్యూయార్క్ కు చేరుకోవడానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుందని అంతసేపు ఏ వ్యక్తి కూడా కంటైనర్ లో ప్రాణాలతో ఉండరని తెలిపారు. యువకుడికి మెడికల్ టెస్టులు చేయించినట్లు చెప్పారు. మద్యం సేవించడం వల్లే అతను కంటైనర్ లో నిద్రపోయాడని తేలినట్లు వివరించారు.
న్యూయార్క్ వెళ్లే కంటైనర్ లో నిద్రపోయి..
Published Sun, Jul 17 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
Advertisement