
మానవత్వంలేని పాలన
మచిలీపట్నం ధర్నాలో చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
♦ కొత్తమాజేరువన్నీ వయసు మీదపడ్డ మరణాలా?
♦ పరిహారం ఎగ్గొట్టేందుకు బాధితులను అవహేళన చేస్తారా?
♦ ప్రభుత్వ నిర్లక్ష్యమే 19మంది ప్రాణాలు తీసింది
♦ ప్రజలగోడు పట్టని ఈ పాలన ఎక్కువ రోజులుండదు..
♦ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. వారంరోజుల్లో చెక్కులు ఇంటికి పంపిస్తాం
మచిలీపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మనసు, మానవత్వం లేని ప్రభుత్వ పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చాక కొత్తమాజేరు బాధిత కుటుంబాలకు వారం రోజుల్లోనే నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలి ఇటీవల చనిపోయిన 18 మంది కుటుంబాలకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ధర్నా జరిగింది. బందరు మాజీ ఎమ్మెల్యే, అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి పేర్ని నాని అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పేదల నిండు ప్రాణాలను బలి తీసుకుంటుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కొత్తమాజేరులో విషజ్వరాలు ప్రబలి ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించాలి. అన్ని మరణాలకు కారణాలేమిటి? వాటిని ఆపడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి? అని తెలుసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ గ్రామంవైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాకే చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కూడా వెళ్లలేదు. జ్వరాలతో 18మంది మరణించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసిన వెంటనే నేను కొత్త మాజేరు వెళ్లా.
బాధిత కుటుంబాలను పరామర్శించా. ఆ మర్నాడే ఆ గ్రామానికి ఆరోగ్యమంత్రి వెళ్లారు. నా దగ్గరున్న సమాచారం మేరకు.... మే నెల 11న గోవర్ధన్, 12న చెక్కా నాగభూషణం, 14న కృష్ణారావు ఇలా... 11 నుంచి 14వ తేదీ మధ్య ఐదుగురు చనిపోయారు. ఆ తరువాత మొత్తం 18 మంది జ్వరాలతో చనిపోయారు. నిన్న (ఆగస్టు 24న) కూడా తిరుమలశెట్టి బాబూరావు చనిపోయాడు. దీంతో మొత్తం గ్రామంలో చనిపోయిన వారి సంఖ్య 19కి చేరింది. రెండున్నర నెలల కాలంలో 18 మంది ఎందుకు చనిపోయారో ఈ ప్రభుత్వానికి తెలుసా?
గ్రామంలోని మంచినీటి చెరువు, ఓవర్‌హెడ్ ట్యాంకులో కోతులు చనిపోయి తాగునీరంతా కలుషితమై జనం చనిపోతుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏడాదికోసారి చెరువు, మూడు నెలలకోసారి వాటర్ ట్యాంకులను, ఫిల్టర్లను శుభ్రం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? సీఎం చంద్రబాబు ఇప్పటికైనా నిద్ర మేల్కొని గ్రామానికి వె ళ్లి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వకుండా... పరిహారం తప్పించుకునేందుకు మృతుల కుటుంబాలను కించపరుస్తున్నారు.
జ్వరాలవల్ల ప్రజలు చనిపోతున్నారని దేశానికి తెలిస్తే పరువు పోతుందని... విషజ్వరాలవల్ల మరణించలేదు, వయసు మీదపడడం వల్లనే చనిపోయారంటూ అవహేళన చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ... ఇవన్నీ నీకు మామూలు మరణాలుగా కనిపిస్తున్నాయా?’’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. మోసం, మోసం, మోసం.. అన్న మూడు పదాలతోనే ఆయన అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ‘‘డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగభృతి, అందరికీ ఇళ్లు, ప్రతి ఒక్కరికీ పింఛన్లు... ఇలా మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయాక ప్రజల్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ప్రజల మరణాలపై కూడా అబద్ధాలు చెబుతున్నారు.
ఆయన పాలనెంత దౌర్భాగ్యంగా ఉందంటే.. కృష్ణా డెల్టాలో నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో పోటీపడి కరెంటుకోసం శ్రీశైలం నీటిని ముందుగానే డ్రా చేసి సముద్రంలో కలిపిన పాపం నీకు (చంద్రబాబుకు) తగలకుండా పోతుందా? ఆయన పాలన ఎంత గొప్పగా ఉందంటే... ఈ రోజు ధర్నా గురించి మొన్ననే చెప్పాం. అయినా వినతిపత్రం తీసుకునేందుకు కలెక్టరుగారు లేరట. కనీసం ప్రజల గోడు వినడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేదు. అసలు వీరు మనుషులేనా? అన్న సందేహం కలుగుతుంది.
ఏదిఏమైనా కొత్తమాజేరు బాధిత కుటుంబాలకు ఒక్కటే మాట. బాబు పాలన ఎక్కువ రోజులుండదు.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మోసం చేయని, మనసున్న ప్రభుత్వమది. మీకు తోడుగా మేముంటాం. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే నష్టపరిహారం చెక్కులు మీ ఇంటికే వచ్చేస్తాయ్’’ అంటూ వైఎస్ జగన్ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లి ఆర్డీవో సాయిబాబుకు వినతిపత్రం అందజేశారు.