చౌడు భూమిలో ఎడారి పంట
♦ ఖర్జూరం సాగులో రాణిస్తున్న నల్లగొండ జిల్లా రైతు
♦ పంట చేతికొచ్చిన తొలి ఏడాదే ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం
ముళ్ల చెట్లు పెరిగిన చౌడు భూమిలో ఎడారి పంటగా పేరు పొందిన ఖర్జూరను సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు బండారి వెంకట నారాయణ. నల్లగొండ జిల్లా.. నల్లగొండ రూరల్ మండలం నర్సింగ్ బట్ల ఆయన స్వగ్రామం. 2011లో రెండెకరాల చౌడు భూమిని కొనుగోలు చేశారు. అందులో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి సాగు యోగ్యంగా మార్చారు. చౌడు భూమిలో సాగు చేసేందుకు అనువైన పంటల కోసం అన్వేషించే క్రమంలో ఈ భూమిలో ఈత చెట్లు ఎక్కువగా ఉండటాన్ని గమనించి ఖర్జూరను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఆయన భావించారు.
మొక్క ధర రూ. 3 వేలు
దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న టిష్యూకల్చర్ ఖర్జూర మొక్కలను గుజరాత్ నర్సరీల్లో పెంచుతున్నారు. వెంకట నారాయణ గుజరాత్ వెళ్లి ఖర్జూర నర్సరీలను పరిశీలించారు. ఒక్కో ఖర్జూర మొక్క రూ. 3100 చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కో మొక్కకు రవాణాకు రూ. 400 వరకు ఖర్చయింది. 2012 మార్చిలో రెండడుగుల గుంతలు తీసి మొక్కలు నాటుకున్నారు. చౌడు భూమి కావటంతో గుంతల్లో ఎర్రమట్టి పోశారు. పాదుల మధ్య 25 అడుగుల ఎడం ఉండేలా ఎకరాకు 60–70 మొక్కలు నాటుకున్నారు. బోరు నీటిని డ్రిప్పు ద్వారా మొక్కలకు అందిస్తున్నారు.
పరపరాగ సంపర్కం జరిగేందుకు ఎకరాకు 5 మగ ఖర్జూర చెట్లను నాటారు. వీటి నుంచి వచ్చే కాయలను సేకరించి పొడిగా చేస్తారు. ఈ పొడిని ఎకరంలోని ఆడ ఖర్జూర చెట్లకు వచ్చే గెలలపై చల్లుతారు. అయితే మగ చెట్లు 5 ఏళ్ల వయసులోనే గెలలు వేస్తాయి. దీంతో తొలి ఏడాది గుజరాత్ నుంచి పౌడర్ కొనుగోలు చేసి వాడారు. దీని ధర కిలో రూ. 10 వేలు. ఎకరాకు అరకిలో పౌడర్ సరిపోతుంది. ఖర్జూర చెట్ల నుంచి కల్లును సేకరించవచ్చు కానీ మొక్కల జీవిత కాలం తగ్గుతుంది.
సాగు ఖర్చులు ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలు
ఏడాదికి ఐదు సార్లు ఎరువులు వేశారు. శిలీంద్రాలు, కుమ్మ పురుగు ఆశించకుండా పురుగు మందులు, తెగుళ్ల మందులు నెలకోసారి పిచికారీ చేశారు. వీటన్నింటికి ఏడాదికి ఎకరాకు రూ. 10 వేల వరకు ఖర్చయింది. చిలకలు, ఉడుతలు కాయలను తినకుండా గెలలకు ఉల్లి సంచులను కట్టారు. పంట చేతికొచ్చేవరకు ఎకరాకు రూ. 2.50 లక్షల ఖర్చయిందని నారాయణ తెలిపారు. 2016 మార్చిలో చెట్లకు పూత వచ్చింది. జూలైలో దిగుబడి వచ్చింది. తొలి ఏడాది 40 చెట్లకు మాత్రమే పంట వచ్చింది. చెట్టుకు 20 కిలోల చొప్పున దిగుబడి తీశారు.
మార్కెట్లో ధర తక్కువగా లభిస్తుండటంతో కిలో రూ. 150 చొప్పున ఇంటివద్దనే విక్రయించారు. తొలి ఏడాది 14 క్వింటాళ్లకు రూ. 2 లక్షల ఆదాయం లభించింది. ఎండు ఖర్జూరంగా మార్చటానికి ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో లేకపోవటం వల్ల కోసిన నాలుగు ఐదు రోజుల్లో పంటను అమ్ముకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే విక్రయించారు. ఈ ఏడాది జూలైలో మళ్లీ పంట చేతికొస్తుంది. ఈసారి అన్ని చెట్ల నుంచి పంట రావటంతో పాటు దిగుబడి పెరుగుతుందని వెంకట నారాయణ తెలిపారు. 10 ఏళ్లు తిరిగేసరికి చెట్టుకు క్వింటాన్నర దిగుబడి వస్తుందన్నారు.
– కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్