సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్– సర్కారుకు మధ్య వివాదం తలెత్తింది. ఆయిల్‌పాం నోటిఫై ఏరియాను ప్రైవేటుకు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్కారుకే ఆయిల్‌ఫెడ్ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే సహకార సంస్థ... ప్రభుత్వ నిర్ణయాన్నే సవాల్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ చేతిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగు, కొత్త ఏరియాల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంతో వివాదం మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 ప్రైవేటు కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు కేవలం 24,500 ఎకరాలు (2.97 శాతం) కేటాయిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేయడం... ఆయిల్‌ఫెడ్ అధికారులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయిల్‌ఫెడ్ నేరుగా ప్రభుత్వానికే లేఖాస్త్రం సంధించడం కలకలం రేపుతోంది. ఆయిల్‌ఫెడ్ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
3.07 లక్షల ఎకరాలకు దరఖాస్తు చేస్తే
‘కేంద్రం 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలను నోటిఫై చేసింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 99,985 ఎకరాలు, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో 50 వేల ఎకరాలు, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో 1.57 లక్షల ఎకరాలు మాకు కేటాయించాలని కోరాం. మొత్తంగా 12 జిల్లాల్లో 3.07 లక్షల ఎకరాలు కోరుతూ ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాం. కానీ ప్రభుత్వం 22 జిల్లాల్లోని 7,99,662 ఎకరాలను 13 ప్రైవేట్ కంపెనీలకు కేటాయించింది. ఆయిల్‌ఫెడ్‌కు మాత్రం కేవలం 24,500 ఎకరాలే ఇచ్చింది’అని ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. అందులో గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొత్తగా 20 వేల ఎకరాలు కేటాయించగా, ఇప్పటికే తమ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 4,500 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొంది. 1993 నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 41,232 ఎకరాలు ఆయిల్‌ఫెడ్ పరిధిలో ఉందని, అందుకోసం రెండు అధునాతన ఫ్యాక్టరీలను నెలకొల్పామని పేర్కొంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఇప్పటికే తమ పరిధిలో ఉన్న ఆయిల్‌పాంను కూడా ప్రైవేటుకు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది.
కోట్లు ఖర్చుచేస్తే ప్రైవేటుకు ఇవ్వడమేంటి?
ఈ ఏడాది జనవరిలో పూర్వ మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టు కింద నర్సరీలు చేపేట్టేందుకు ఆయిల్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2020–21లో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో, మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోనూ ఆయిల్‌పాం నర్సరీని ఆయిల్‌ఫెడ్ నెలకొల్పింది. ఈ రెండింటి పరిధిలో 7 వేల ఎకరాలు కేటాయించారు. అందుకోసం ఆయిల్‌ఫెడ్ రూ. 6 కోట్లు కూడా కేటాయించింది. ఇంతటి కృషిచేస్తే గద్వాల, నారాయణపేట జిల్లాలను మినహా మిగిలిన ఏరియాలను ఆయిల్‌ఫెడ్‌కు బదులు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ఏమాత్రం సమంజసం కాదని లేఖలో ఆయిల్‌ఫెడ్ పేర్కొంది. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆయిల్‌ఫెడ్‌కు అన్యాయం జరిగిందని తెలిపింది. కాబట్టి ఇప్పటికైనా 15 శాతం ఆయిల్‌పాం నోటిఫై ఏరియాను తమకు కేటాయించాలని విన్నవించింది.
నేను కూడా లేఖ రాస్తా: కంచర్ల రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్‌ఫెడ్
అనుకున్నంత ఏరియా ఆయిల్‌ఫెడ్‌కు రాలేదనేదే నా ఆవేదన. రైతులకు న్యాయం జరగాలంటే అన్ని ప్రాంతాల్లోనూ ఆయిల్‌ఫెడ్‌కు కొంతమేరకు ఆయిల్‌పాం సాగు పరిధిని పెంచాలి. ఈ విషయంపై ఇప్పటికే ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. నేను కూడా లేఖ రాస్తాను. అవసరమైతే సీఎంకు విన్నవిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment