తీరని రచనా దాహం | Bhandaru srinivasa rao writes about senior journalist V. Hanumantha Rao | Sakshi
Sakshi News home page

తీరని రచనా దాహం

Published Wed, Dec 14 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

తీరని రచనా దాహం

తీరని రచనా దాహం

నివాళి

జర్నలిస్ట్‌ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు తన 92వ ఏట నిన్న మంగళవారం  ఉదయం హైదరాబాదులో కన్ను మూశారు. ఈతరం వారికి తెలియని ఈ వృద్ధ పాత్రికేయుడి గురించి తెలియచెప్పాలంటే ఏదో సినిమాలోలా కథను ముందుకూ వెనక్కీ తిప్పాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా తల్వార్‌ ఉండేవారు. బ్యాంకులో పనిచేసే అన్ని శ్రేణుల అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదు, బేగంపేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్‌ బ్యాంక్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవం బ్యాంక్‌ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.

ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లావెళ్లి వద్దాం. స్టేట్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బ్యాంక్‌ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బ్యాంక్‌ శాఖలో పనిచేస్తున్న ఎర్రం రాజు అనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెళుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్‌.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణ మంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరూ సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు.

కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిస్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్థుడు అనే పెద్ద పేరు చిన్నతనంలోనే తెచ్చుకున్న వి.హనుమంతరావును తీసుకెళ్లారు. ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ తీరును గమనిస్తున్న ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. పేద రైతులు వాళ్ళ అవసరాలు లేదా వారి తాహతు కొద్దీ వంద నుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు. దీన్ని గమనిస్తూ వచ్చిన హనుమంతరావు రైతులు పూర్తిచేసిన ఒక దరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూశారు. ఒక్కొక్కదానిపై 400 వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధ్రువపరచుకున్న ఆయన క్షణం ఆలస్యం చేయకుండా పోస్ట్‌ ఆఫీసుకు వెళ్లి, వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.

మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే... ‘రూ.100ల రుణం కోసం నాలుగు వందల సంతకాలు’ అంటూ యూఎన్‌ఐ పంపిన వార్తను ఒక ఇంగ్లీష్‌ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది. స్టేట్‌ బ్యాంక్‌ చైర్మన్‌ తల్వార్‌ పాల్గొన్న స్టాఫ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవం వార్త కూడా ఫొటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురితమైంది. కానీ ఆ వార్త స్టేట్‌ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్‌ దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీశారు. వంద రూపాయలకు ఇన్ని సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమేనని తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణమంజూరీ పద్ధతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.

ఒక జర్నలిస్ట్‌ తన చుట్టూ ఉన్న విషయాల్ని ‘గమనించడం’ అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు, ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే హనుమంతరావుగారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ డెబ్బయి ఏళ్ళకు పైగా రాస్తూ పోయిన, రాస్తూనే దాటిపోయిన హనుమంతరావు నిజంగా ధన్యజీవి. రాయడం, రాస్తూ ఉండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం.

గొప్ప జర్నలిస్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం ఎంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిస్టు భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిస్టులు నాకు చాలామంది తెలుసు. జి. కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారిదే.

- భండారు శ్రీనివాసరావు
సీనియర్‌ జర్నలిస్టు, 98491 30595

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement