Bhandaru srinivasa rao
-
YSR: అఖిల భారతావనికి అడుగుజాడ
వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు బలిపెట్టని నాయకుడు వైఎస్సార్. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. మాట తప్పని, మడమ తిప్పని ఆయన గుణమే ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేటట్టు చేసింది. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న రైతాంగానికి జీవశక్తిని అందించారు. వ్యవసాయ పునరుజ్జీవనానికి బాటలు పరిచారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. కపటం లేని ఆ మందహాసం... సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే ఉంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే ఉంది. ఆ విషాద ఘడియల్లో దేశ వ్యాప్తంగా మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం ‘వైఎస్సార్’. ఆ పేరు ఇక ముందు కూడా వినబడు తూనే ఉంటుంది కానీ, ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు కదా. ఒక వ్యక్తి గుణ గణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసు కునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ అరవై ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేఖరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. బిగుసుకుపోయినట్టు ఉండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో అత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిన సందర్భాలున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్‌కు రాష్త్రవ్యాప్తంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది. 1975లో నేను రేడియో విలేఖరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది. వైఎస్సార్‌ను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భమది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్. ఇటు హైదరాబాదు లోనూ, అటు ఢిల్లీ లోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండడం సహజమే. 2004లో ఆయన తొలిసారి సీఎం కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక విలేఖరికీ, ఒక రాజకీయ నాయకుడికీ నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెన వేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, ‘రెండు కన్నీటి బొట్లు’ రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ సంక్షేమానికి చెదరని చిరునామా నాలుగేళ్లక్రితం చెన్నై వెళ్లినప్పుడు మా బంధువొకాయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ప్రశ్న వేశారు. ‘వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన నేతలు న్నారు కదా, కానీ ఆ పథకాలు ప్రస్తావనకు వచ్చి నప్పుడు వైఎస్‌నే అందరూ ఎందుకు గుర్తు చేసు కుంటార’న్నది ఆ ప్రశ్న సారాంశం. నిజమే... ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు సైతం రోజూ గుక్కెడు బువ్వ అందుబాటులోకి వచ్చేలా చేశారు. అంతకు చాన్నాళ్ల ముందే ‘గరీబీ హఠావో’ అంటూ ఇందిరాగాంధీ కూడా ఎన్నో పథకాలు తెచ్చారు. తమిళనాట అధికారంలోకి రాగానే నిరుపేదలకు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు పంచిపెట్టిన ప్రభుత్వాలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పోటీలుపడి ఇలాంటి వాగ్దానాలు చేసేవి. అయితే వైఎస్ తీరు వేరు. ఆయన అమలు చేసిన పథకాల ఒరవడే వేరు. ఆ పథకాలు జనసంక్షేమానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలిచాయి. అందుకు కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగే సమ యానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిస్తేజం అలుముకుంది. అప్పటికి ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిపడిన ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా సమస్త చేతివృత్తులూ దెబ్బతిన్నాయి. వరస కరవులతో, అకాల వర్షాలతో రైతాంగం అల్లాడు తోంది. అప్పుల ఊబిలో దిగబడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. అప్పటికే ఉన్న ధనిక, పేద; పట్టణ, గ్రామీణ అంతరాలు మరింత పెరిగాయి. కొనుక్కునే స్థోమత ఉంటే తప్ప నాణ్యమైన చదువుకు దిక్కు లేకుండా పోయింది. రోగం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినవారికి యూజర్ ఛార్జీల బాదుడు మొదలైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావతో ఇతర సీఎంల కన్నా అత్యుత్సాహంగా సంస్కరణలు అమలు చేయడం వల్ల ఏపీ మరింత దుర్భరంగా మారిందేమో గానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ‘ఏదీ వూరికే రాద’ని పాలకులు ఉపన్యాసాలు దంచే పాడుకాలమది. నేలవిడిచి సాముచేసే నాయకులను తమ ముఖపత్రాలపై అచ్చోసే అంతర్జాతీయ పత్రికలకు అప్పుడు కొదవలేదు. సరిగ్గా ఆ సమ యంలో వైఎస్సార్ పాద యాత్ర నిర్వహించి ప్రజల దుర్భర స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. 1,400 కిలోమీటర్ల పొడ వునా సామాన్యుల గుండె ఘోషను అతిదగ్గర నుంచి వినగలిగారు. వీరందరి జీవితాల మెరుగుదలకు ఏం చేయగలమన్న మథనం ఆయనలో ఆనాడే మొదలైంది. తర్వాత కాలంలో ఆయనే చెప్పుకున్నట్టు ఆ పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాగల అయిదేళ్లకూ పాలనా ప్రణాళికను నిర్దేశించింది. వ్యక్తిగా కూడా ఆయనను ఆ పాదయాత్ర ఎంతో మార్చింది. రాయలసీమ ప్రాంత నేతగా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉంది. కానీ అది ‘జలయజ్ఞం’గా రూపుదిద్దుకున్నది జనం మధ్యనే! అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆ లక్ష్యం వేల కోట్ల వ్యయంతో ముడిపడి ఉంటుంది గనుక అది అసాధ్యమనుకున్నారంతా! కానీ భర్తృహరి చెప్పినట్టు ఎన్ని అడ్డంకులెదురైనా వెరవక తుదికంటా శ్రమించడమే కార్యసాధకుల నైజమని వైఎస్ భావించారు. ఈ అనితర సాధ్యమైన ప్రయత్నానికి సమాంతరంగా ఉచిత విద్యుత్ జీవోపై తొలి సంతకం చేసి అన్నివిధాలా చితికిపోయి ఉన్న రైతాంగానికి తక్షణ జీవశక్తిని అందించారు. బాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించి, దాని పునరుజ్జీవానికి బాటలు పరిచారు. అంతేకాదు... అంతవరకూ ఆకాశపు దారుల్లో హడావిడిగా పోయే ఆరోగ్య సిరిని భూమార్గం పట్టించి నిరుపేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద వర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభి వృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన సాహసిగా, తనకు తెలిసినవారైనా కాకున్నా, తన పార్టీవారు అయినా కాకున్నా సాయం కోరివచ్చిన వారందరి పట్లా ఒకేలా స్పందించిన సహృదయుడిగా వైఎస్ చిరస్థాయిగా నిలుస్తారు. పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నేతను దేశవ్యాప్త రైతాంగానికి రుణమాఫీ తక్షణావసరమని ఒప్పించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర. ఇలాంటి నాయకుడు సంక్షేమానికి శాశ్వత చిరునామా కావడంలో, ఆ విషయంలో అఖిల భారతావనికి అడుగుజాడ కావడంలో ఆశ్చర్యమేముంది? -టి. వేణుగోపాలరావు సీనియర్ పాత్రికేయులు -
2 Years Of YS Jagan Rule In AP: సంక్షేమానికి పెద్దపీట
అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద కేంద్రీకృతం అయినట్టు ఈ రెండేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యాస, శ్వాస యావత్తూ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల మీదనే పెట్టారు. మేనిఫెస్టో తనకు ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని పలుసార్లు ఆయనే స్వయంగా చెబుతూ వచ్చారు. అలానే చేస్తూ వచ్చారు. ఇది తప్పా ఒప్పా అంటే జవాబు వుండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రభుత్వాలను ఎలా తప్పుపట్టగలం? కానీ, అవే సర్వస్వంగా భావించి మిగిలిన అవసరాలను పక్కన పెడుతూ పోతే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ఖజానాలో మిగిలే మొత్తమెంత? అభివృద్ధి లేని సంక్షేమం వల్ల రాష్ట్ర పురోభివృద్ధి ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉన్నప్పటికీ నైతిక బాధ్యత మాత్రం లేదు. కారణం ప్రజలు ఆయన పెట్టుకున్న ప్రాధాన్యతలు గుర్తెరిగి, ఏరికోరి మరీ అధికారం ఒప్పచెప్పారు. ప్రతి ప్రజాప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటుంది. అలా ఏర్పరచుకున్న ప్రాధాన్యతల ప్రకారం తనకు తాను దిశానిర్దేశం చేసుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇందుకు మినహాయింపు కాదు. అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడ అంటే సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు అన్వయం చెప్పుకోవడంలో ఎవరి పద్ధతులు వారికి వున్నాయి. ‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ముఖ్యమంత్రిగా నా కర్తవ్యం’ అని ఆనాడు ఎన్టీ రామారావు బహిరంగంగా ప్రకటించేవారు. అలా అమల్లోకి వచ్చినవే రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలు. తర్వాత చంద్రబాబు ఒక యువ సీఎంగా ఆనాడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిం చుకున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన మార్పులు మాత్రం రాజకీయంగా అచ్చిరాలేదు. అభివృద్ధి అంటే పైకి కానవచ్చే రోడ్లు, సుందరమైన భవనాలు కాదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ అపప్రథను తొలగించుకోవడానికి ఆయన 2014 ఎన్నికలకు ముందు ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధిం చాలి అంటే సంక్షేమమే తారకమంత్రం అని రాజ కీయ నాయకులు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వాస్తవాన్ని అన్ని పార్టీలూ గుర్తించి అందుకు అనువైన పథకాలను ఎన్నికల ప్రణాళికల్లో ఆకర్షణీయమైన పేర్లతో రూపొందించే పనిలో పడ్డాయి. వైఎస్ జగన్ మస్తిష్కంలో ‘నవరత్నాలు’ పేరిట రూపుదిద్దుకున్న పథకం కూడా అటువంటిదే. తాను అధికారంలోకి రాగానే వాటిని తు.చ. తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, 2019లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వైఎస్ జగన్ ఆ ఏడాది మే 30న నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తిగా సంక్షేమానికి పెద్ద పీట వేసిన నవరత్నాలు హామీ ఆయన విజ యానికి చాలావరకు దోహదం చేసివుండవచ్చు. మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో అనేక పథకాలకు కేటాయింపులు ప్రకటించినప్పుడు రెండేళ్లుగా ఇన్ని పథకాలు అమలవుతున్నాయా అని అనిపించింది. ప్రతి పథకానికి ఒక కాల నిర్ణయ పట్టిక పెట్టుకుని, నెలలు, తేదీల ప్రకారం ఒక పద్ధతిగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్న మాట నిజం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. ఆ వైతరణి దాటి, అధికారంలోకి రాగానే ‘బోడి మల్లయ్య’ సామెత మాదిరిగా వ్యవహరిస్తుంటాయి అనే అపప్రథ వుంది. కానీ వైఎస్ జగన్ ఈ విషయంలో పాత బాణీని పక్కన పెట్టి కొత్త బాట ఎంచుకున్నట్టుగా వుంది. సంక్షేమం సరే, అభివృద్ధి మాటలేమిటి.. అనే విపక్షాల విమర్శలకు ఆయన బడ్జెట్ సమావేశంలోనే అన్యాపదేశంగా ఇలా జవాబు చెప్పారు. ‘‘అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాల నిర్మాణం కాదు, సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ల కనీస అవసరాలను తీర్చడం కూడా అభివృద్ధే’’. -భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మొబైల్: 98491 30595 -
తీరని రచనా దాహం
నివాళి జర్నలిస్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు తన 92వ ఏట నిన్న మంగళవారం ఉదయం హైదరాబాదులో కన్ను మూశారు. ఈతరం వారికి తెలియని ఈ వృద్ధ పాత్రికేయుడి గురించి తెలియచెప్పాలంటే ఏదో సినిమాలోలా కథను ముందుకూ వెనక్కీ తిప్పాలి. ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ చైర్మన్‌గా తల్వార్ ఉండేవారు. బ్యాంకులో పనిచేసే అన్ని శ్రేణుల అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదు, బేగంపేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవం బ్యాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు. ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లావెళ్లి వద్దాం. స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బ్యాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రం రాజు అనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెళుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణ మంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరూ సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిస్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్థుడు అనే పెద్ద పేరు చిన్నతనంలోనే తెచ్చుకున్న వి.హనుమంతరావును తీసుకెళ్లారు. ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ తీరును గమనిస్తున్న ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. పేద రైతులు వాళ్ళ అవసరాలు లేదా వారి తాహతు కొద్దీ వంద నుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు. దీన్ని గమనిస్తూ వచ్చిన హనుమంతరావు రైతులు పూర్తిచేసిన ఒక దరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూశారు. ఒక్కొక్కదానిపై 400 వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధ్రువపరచుకున్న ఆయన క్షణం ఆలస్యం చేయకుండా పోస్ట్ ఆఫీసుకు వెళ్లి, వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు. మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే... ‘రూ.100ల రుణం కోసం నాలుగు వందల సంతకాలు’ అంటూ యూఎన్ఐ పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది. స్టేట్ బ్యాంక్ చైర్మన్ తల్వార్ పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫొటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురితమైంది. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీశారు. వంద రూపాయలకు ఇన్ని సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమేనని తేలింది. ఆయన వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణమంజూరీ పద్ధతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు. ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని ‘గమనించడం’ అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు, ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే హనుమంతరావుగారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ డెబ్బయి ఏళ్ళకు పైగా రాస్తూ పోయిన, రాస్తూనే దాటిపోయిన హనుమంతరావు నిజంగా ధన్యజీవి. రాయడం, రాస్తూ ఉండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం. గొప్ప జర్నలిస్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం ఎంత కష్టమో తెలిసేది మాత్రం ఆ జర్నలిస్టు భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిస్టులు నాకు చాలామంది తెలుసు. జి. కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారిదే. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, 98491 30595 -
కళ్లముందే కరిగిన కల
సందర్భం పేదలకు నాణ్యమైన వైద్యం కోసం కలగన్న మనిషి అర్ధంతరంగా అంతర్థాన మయ్యాడు. ఒక గొప్ప స్వప్నం కళ్లముందే ఆవిరైపోయింది. ప్రపంచానికే ఆద ర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం కొందరి నిర్వాకాలకు నీరుగారిపోయింది. కారు నడుపుతున్న సుశీల భర్త ఉన్నట్టుండి కారు పక్కకు తీసి స్టీరింగుపై వాలిపో యాడు. చీకటి ప్రదేశంలో దిక్కుతోచని స్థితి ఆమెది. ఏం చెయ్యాలి? పీతాంబరం స్థితి మంతుడు. మనుమడికి నీళ్ల విరోచనాలు మొదలైనాయి. ఊళ్లో ఫోన్లు ఉన్నా ఆసుపత్రే లేదు. ఆసుపత్రికి వెళ్లడానికి బస్సులు లేవు. ఏం చెయ్యాలి? ఏకాంబరం ఊళ్లో ఆసుపత్రి వుంది. డాక్టరు ఉండడు. రోగం రొష్టూ వస్తే మళ్లీ నాటువైద్యమే గతి. సోమయ్య ఊళ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. డాక్టరు ఊళ్లోనే ఉన్నా.. రక్తపరీక్షకు, ఎక్స్‌రేలకు పక్కన వున్న బస్తీకి వెళ్లాలి. తీరా వెడితే కరెంటు ఉండదు. అది ఉన్నా ఎక్స్‌రే తీసేవాడు ఉండడు. ఏం చెయ్యాలి? ఇవన్నీ వైద్య సమస్యలే. కాని పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నమ్మకం. స్వయానా డాక్టరు కావడంతో పరిష్కారం దిశగా ఆలోచన చేశారు ప్రజా రోగ్యం విషయంలో ఆదర్శాలు కలిగిన మరికొంత మంది వైద్యులు జత కలిశారు. నిబద్ధతగల అధికారులు తోడయ్యారు. ఆ విధంగా అప్పటికే జనాదరణ పొందిన 108కి తోడుగా 104 రూపు దిద్దుకుంది. అయితే వైఎస్ఆర్ కల అంతటితో ఆగలేదు. గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్న వాళ్లు ఏమైపోవాలి? ఆ ఆలోచనలోంచే ఆరోగ్యశ్రీకి అంకురార్పణ జరిగింది. చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా కోసం నిత్యం అందుబాటులో ఉండే 104 ఉచిత కాల్ సెంటర్. నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం, అత్యవసర వైద్యసాయం కోసం 108 అంబులెన్సు, ఇక పెద్ద రోగాల పాలబడి ఎవరు కాపాడుతారని ఎదురుచూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.. ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభై రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్లో పది శాతం కన్నా తక్కువన్నమాట. ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో సీఎం వైఎస్ అనేవారు.. కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి, తిరిగి తల్ల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తల్లిదండ్రుల బాధ్యత. ఇక నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్ల్లు. వాళ్ల బాధ్యత ప్రభుత్వానిదే. ఇంతేకాదు. 104కాల సెంటర్‌కు ఇంకా విస్తృత మైన లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ క్లిని క్లు ఔషధ దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేశారు. అర్ధరాత్రి, అపరాత్రి అన కుండా రాష్ర్టంలో ఏమూల నుంచి ఫోన్ చేసినా వారు ఉండే ప్రదేశానికి ఇవన్నీ ఎంత దూరంలో ఉన్నాయి, ఏ సమయాల్లో పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడా నికి వీలుగా ఈ ఏర్పాటు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నాణ్యత కలిగిన ైవైద్య చికిత్సలను కలిగిన వారికే కాదు, పేదసాదలకు కూడా అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఆరోగ్య శ్రీ లక్ష్యం. ఆ దార్శనికుడు కన్న కల సాకారం అయ్యే కృషి మొదలయింది. అందులోని వైశిష్ట్యం ఎలాంటిదో ప్రజ లకు క్రమంగా అవగతమవుతోంది. దురదృష్టం. అప్పుడే విధి వక్రించింది. దొంగచాటుగా మృత్యుపాశం విసిరింది. పేదలకు ఉచిత వైద్యంపై కలగన్న మనిషి అర్ధంతరంగా అంతర్థానమయ్యాడు. కంటున్న కల ఆయన కనురెప్పల్లోనే కరిగిపోయింది. ఒక గొప్ప స్వప్నం ఆవిష్కారానికి ముందే ఆవిరి అయిపోయింది. అంత చక్కటి పథకం అరకొరగా మిగిలి పోయింది. రాజకీయ విషక్రీడకు బలయిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే పథకంగా ముద్రవేసి, అసం పూర్తిగా దాన్ని అటక ఎక్కించారు. కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్థాలకు బలయిపోయింది. ఇంకొందరి అహాలను చల్ల్లార్చడానికి మాడి మసైపోయింది. రాజ కీయ చదరంగంలో చిక్కుకుపోయి ఎత్తులు, పై ఎత్తు లకు చిత్తయిపోయింది. ఇప్పుడీ పథకం ఉందా అంటే ఉన్నట్టు, లేదా అంటే లేనట్టుగా ఉంది. ఆయన అదృష్టవంతుడు, దాటిపోయాడు. ఊళ్లకు దూరంగా, వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా కొండలు, కోనల్లో నివసించే వారు దురదృష్టవంతులు. వారి బతు కుల్ని మార్చే గొప్ప పథకానికి వారు దూరం అయ్యారు. - భండారు శ్రీనివాసరావు (వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా...) వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు 9849130595