
అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద కేంద్రీకృతం అయినట్టు ఈ రెండేళ్లలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్యాస, శ్వాస యావత్తూ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల మీదనే పెట్టారు. మేనిఫెస్టో తనకు ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని పలుసార్లు ఆయనే స్వయంగా చెబుతూ వచ్చారు. అలానే చేస్తూ వచ్చారు.
అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద కేంద్రీకృతం అయినట్టు ఈ రెండేళ్లలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్యాస, శ్వాస యావత్తూ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల మీదనే పెట్టారు. మేనిఫెస్టో తనకు ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని పలుసార్లు ఆయనే స్వయంగా చెబుతూ వచ్చారు. అలానే చేస్తూ వచ్చారు. ఇది తప్పా ఒప్పా అంటే జవాబు వుండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రభుత్వాలను ఎలా తప్పుపట్టగలం? కానీ, అవే సర్వస్వంగా భావించి మిగిలిన అవసరాలను పక్కన పెడుతూ పోతే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ఖజానాలో మిగిలే మొత్తమెంత? అభివృద్ధి లేని సంక్షేమం వల్ల రాష్ట్ర పురోభివృద్ధి ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉన్నప్పటికీ నైతిక బాధ్యత మాత్రం లేదు. కారణం ప్రజలు ఆయన పెట్టుకున్న ప్రాధాన్యతలు గుర్తెరిగి, ఏరికోరి మరీ అధికారం ఒప్పచెప్పారు.
ప్రతి ప్రజాప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటుంది. అలా ఏర్పరచుకున్న ప్రాధాన్యతల ప్రకారం తనకు తాను దిశానిర్దేశం చేసుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇందుకు మినహాయింపు కాదు. అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడ అంటే సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు అన్వయం చెప్పుకోవడంలో ఎవరి పద్ధతులు వారికి వున్నాయి. ‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ముఖ్యమంత్రిగా నా కర్తవ్యం’ అని ఆనాడు ఎన్టీ రామారావు బహిరంగంగా ప్రకటించేవారు. అలా అమల్లోకి వచ్చినవే రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలు. తర్వాత చంద్రబాబు ఒక యువ సీఎంగా ఆనాడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిం చుకున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన మార్పులు మాత్రం రాజకీయంగా అచ్చిరాలేదు. అభివృద్ధి అంటే పైకి కానవచ్చే రోడ్లు, సుందరమైన భవనాలు కాదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ అపప్రథను తొలగించుకోవడానికి ఆయన 2014 ఎన్నికలకు ముందు ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధిం చాలి అంటే సంక్షేమమే తారకమంత్రం అని రాజ కీయ నాయకులు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వాస్తవాన్ని అన్ని పార్టీలూ గుర్తించి అందుకు అనువైన పథకాలను ఎన్నికల ప్రణాళికల్లో ఆకర్షణీయమైన పేర్లతో రూపొందించే పనిలో పడ్డాయి. వైఎస్ జగన్ మస్తిష్కంలో ‘నవరత్నాలు’ పేరిట రూపుదిద్దుకున్న పథకం కూడా అటువంటిదే. తాను అధికారంలోకి రాగానే వాటిని తు.చ. తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, 2019లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
వైఎస్ జగన్ ఆ ఏడాది మే 30న నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తిగా సంక్షేమానికి పెద్ద పీట వేసిన నవరత్నాలు హామీ ఆయన విజ యానికి చాలావరకు దోహదం చేసివుండవచ్చు. మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో అనేక పథకాలకు కేటాయింపులు ప్రకటించినప్పుడు రెండేళ్లుగా ఇన్ని పథకాలు అమలవుతున్నాయా అని అనిపించింది. ప్రతి పథకానికి ఒక కాల నిర్ణయ పట్టిక పెట్టుకుని, నెలలు, తేదీల ప్రకారం ఒక పద్ధతిగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్న మాట నిజం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. ఆ వైతరణి దాటి, అధికారంలోకి రాగానే ‘బోడి మల్లయ్య’ సామెత మాదిరిగా వ్యవహరిస్తుంటాయి అనే అపప్రథ వుంది. కానీ వైఎస్ జగన్ ఈ విషయంలో పాత బాణీని పక్కన పెట్టి కొత్త బాట ఎంచుకున్నట్టుగా వుంది.
సంక్షేమం సరే, అభివృద్ధి మాటలేమిటి.. అనే విపక్షాల విమర్శలకు ఆయన బడ్జెట్ సమావేశంలోనే అన్యాపదేశంగా ఇలా జవాబు చెప్పారు. ‘‘అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాల నిర్మాణం కాదు, సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ల కనీస అవసరాలను తీర్చడం కూడా అభివృద్ధే’’.
-భండారు శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
మొబైల్: 98491 30595