నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం. 1981 నుంచీ ఐక్యరాజ్యసమితి ప్రకటన ద్వారా నూట తొంభై మూడు దేశాల్లో పాటించే రోజు ఇది. భూమే మాతృదేశంగా తన దేశభక్తి గీతం రాసిన ఏకైక ప్రపంచ కవి గురజాడ పుట్టినరోజు కూడా. మోతాదు మించిన దేశభక్తి చెడుకు దారి తీస్తుంది అన్నది చరిత్ర ఎరిగిన సత్యం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలోని జర్మనీ, ఇటలీ దేశాల్లో, ఇటు ఆసియాలోని సైనిక జాతీయ మనస్తత్వం గల జపాన్‌లో ఒక్కసారి పెల్లుబికిన ఈ దేశభక్తి మహమ్మారి, కోట్లాదిమంది ప్రజల అకాల మృతికి, ప్రపంచ దుస్థితికీ దారితీసింది. అతిగా వాగి, అనర్థాలకు కారణం కావడం దేశభక్తి కన్నా హీనమైన పాపం అని సంచలన తెలుగు రచయిత చలం అన్నారు. ఒక మోతాదు దాటాక మాతృసీమలూ, పితృసీమలూ మనుషుల్ని చంపే ద్వేషకారకాలు అవుతాయి తప్ప, వాటికి వేరే మార్గం లేదు.
దేశభక్తి అవధులు దాటిన సైనిక కార్యకలాపాలకు దారి తీస్తుందన్నారు ఠాగోర్. ‘‘దేశభక్తి మనకు అంతిమ విశ్రాంతి మందిరం కాలేదు. నేను జీవించి ఉండగా మానవత్వం మీద దేశభక్తిది పై చేయి కానివ్వను’’ అంటూ ఈ ముదిరిపోయే దేశభక్తి ఎంత నష్టకారకమో చెబుతూ తీవ్రంగా వ్యతిరేకించాడు టాగోర్. ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది అని గురజాడ అంటే, అలా చరిత్రను తిరగ రాసే ఆధునిక మహిళలను మేం కాల్చి చంపుతాం అనే కాల సందర్భంలో ఇరుక్కుని ఉన్నాం. దేశభక్తి ఇప్పుడు పశువుల పేరిట, పవిత్రతల పేరిట, సంకుచితమైన గోడల పేరిట, మీటర్ల ఎత్తు విగ్రహాల్లా పెరుగుతానని భయపెడుతూ, కొందరి చేతిలో గాఢగంధకంలా మారి, మనకు కళ్ళ మంటలు పుట్టిస్తూ, ఇతర పేలుడు సామాన్లుచేరి కూరినప్పుడల్లా విస్ఫోటించి మనిషి గురించి ఆలోచించే వారిని పూనకంతో బలి తీసుకుంటున్నది. ప్రపంచం ఎవరి సొంత పెరడూ కాదు. ఆయుధాల నిల్వ కొట్టు కాదని, ప్రపంచ బేహారులకు తెలియచెప్పడమే అంతర్జాతీయ శాంతి దినాన సామాన్య మానవుల కర్తవ్యం.
(నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం)
రామతీర్థ, ప్రముఖ కవి, రచయిత ‘ 9849200385
మితిమీరిన దేశభక్తి ప్రమాదకారి
Published Thu, Sep 21 2017 1:25 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
Advertisement