చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరగడం, సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండటం వ్యక్తిమాత్రులకు సాధ్యం కాదు. జనాదరణగల ఉద్యమాల్లో పనిచేసేవారి పరిస్థితి వేరు. అలాగే అధికారంలో ఉన్నవారి అండదండలున్నవారి సంగతి వేరు. అలాంటి వారికి సైతం ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు ఎదురుగాక తప్పదు. ఎందుకంటే ఉద్యమాలు నీరసించవచ్చు లేదా కోవర్టుల బెడద వచ్చిపడొచ్చు. ఇక అధికారం అండతో చెలరేగేవారు అది రచ్చకెక్కాక పెత్తనం చలాయించలేరు. సోమవారం వేకువజామున తెలంగాణలోని షాద్‌నగర్ సమీపంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించాడంటున్న నయీముద్దీన్‌పై అనేకానేక ఆరోపణలున్నాయి.
అతను మావోయిస్టు పార్టీ పూర్వరూపమైన పీపుల్స్‌వార్‌లో పనిచేస్తూ హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్ అధికారి కె.ఎస్. వ్యాస్‌ను కాల్చిచంపిన కేసులో నిందితుడు. అది జరిగిన కొన్నాళ్లకే పోలీసులకు చిక్కాడు. అయితే అంతటి తీవ్రమైన కేసులో నిందితుడైన వ్యక్తి అనంతరకాలంలో పోలీసులకు సన్నిహితుడిగా మారాడని ఆరో పణలు రావడమే వింత అనుకుంటే... వారి కనుసన్నల్లోనే మావోయిస్టు సాను భూతిపరులను బెదిరించడం, పౌరహక్కుల సంఘాల నేతలను, మాజీ నక్సల్స్‌ను హతమార్చడంలాంటివి చేస్తున్నాడని పదే పదే ఆరోపణలు వెల్లువెత్తడం ఆశ్చర్య కరమైన విషయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఏ మూల ఏ నేరం జరిగినా నయీం పేరు బయటికొచ్చేది. కాకతీయ కోబ్రాస్, నల్లమల కోబ్రాస్, గ్రీన్ టైగర్స్ లాంటి పేర్ల వెనక నయీమే ఉన్నాడని, అతన్ని పోలీసులే నడిపిస్తున్నారని పౌరహక్కుల సంఘాల నేతలు అనేవారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన యువ గాయకురాలు బెల్లి లలిత మొద లుకొని పౌరహక్కుల సంఘం నేతలు పురుషోత్తం, ఆజం అలీ, నక్సల్ ఉద్యమంలో పనిచేసి బయటికొచ్చి టీఆర్‌ఎస్ నేతగా ఉన్న సాంబశివుడు వరకూ అనేక మర ణాల వెనక నయీం ముఠా హస్తమున్నదని ఆరోపణలొచ్చాయి. రాజకీయ నాయ కులను బెదిరించడం, భూకబ్జాలకు పాల్పడటం, సెటిల్‌మెంట్లు చేయడంవంటివి యధేచ్ఛగా జరుగుతున్నా అతనికి అడ్డూ ఆపూ లేకుండా పోయింది.
దాదాపు 23 ఏళ్లనుంచి నయీం విషయంలో ఆరోపణలొస్తున్నా అవి నిజం కాదని చెప్పడమే తప్ప అతన్ని పట్టి బంధించడానికి, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేయడానికి పోలీసులు నిజాయితీగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒక్క నయీం విషయంలోనే కాదు...అంతక్రితం జడల నాగ రాజు, కత్తుల సమ్మయ్య వంటి కరుడుగట్టిన నేరగాళ్ల విషయంలోనూ ఈ మాదిరి ఆరోపణలే వచ్చాయి. వీరిలో కత్తుల సమ్మయ్య అయితే దర్జాగా పాస్‌పోర్టు, వీసా సంపాదించుకుని విదేశాలకు కూడా వెళ్లిపోయాడు. బహుశా శ్రీలంకలో తాను ప్రయాణిస్తున్న విమానం ప్రమాదంలో చిక్కుకుందని భావించి దూకి చనిపోకపోతే సమ్మయ్య ఎక్కడున్నాడో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయేది. రాజధానికి కూతవేటు దూరంలో ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, అనుచరుల ద్వారా హత్యలకూ, బెదిరింపులకూ, కబ్జాలకూ పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చిన వ్యక్తిని పట్టుకోలేకపోవడమంటే పోలీసు యంత్రాంగానికి సంబంధించిన సకల వ్యవస్థలూ నిరర్ధకంగా మిగిలిపోయినట్టు లెక్క.
వ్యవస్థకు సవాలుగా మారిన ఉద్యమాలను, సంస్థలను నీరుగార్చడానికి, ఆ ఉద్యమ సారథులను మట్టుబెట్టడం ప్రపంచంలో కొత్తగాదు. అలాంటి ఆపరేషన్లలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. తాను శత్రువులని భావిం చినవారిని ఖండాంతరాల్లో ఉన్నా చేతికి నెత్తురంటకుండా చంపడం మొసాద్ ప్రత్యేకత. కశ్మీర్‌లో మిలిటెన్సీ జోరుగా ఉన్నప్పుడు దాని సారథులను హత మార్చడంలో కోవర్టులే కీలకపాత్ర పోషించారు. చట్టపాలనకు, నిబంధనలకు లోబడి వ్యవహరిస్తే కేసులు తెమలవని, నేర నిరూపణ కష్టమని అధికారంలో ఉన్నవారు అనుకోవడమే కోవర్టు ఆపరేషన్లకు మూలం. అందువల్ల తక్షణ ఫలితాలు రావొచ్చు. కానీ అది ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. ఎలాంటి నేరం చేసైనా తప్పించుకు తిరగవచ్చునన్న అభిప్రాయం సమాజంలో బలపడటానికి వీలు కల్పిస్తుంది. చట్టంపై సామాన్య పౌరుల్లో విశ్వాసాన్ని సడలిస్తుంది.
ఏతావాతా పాలన కట్టుతప్పుతుంది. నయీం సజీవంగా పట్టుబడి ఉంటే అనేకమంది ఐపీఎస్ అధికారుల జాతకాలు వెల్లడయ్యేవని ఉన్నతస్థాయిలో పనిచేసి రిటైరైన పోలీసు అధికారి ఒక చానెల్ చర్చా కార్యక్రమంలో అనడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటైన విషయం. నయీం స్థావరంగా వినియోగించుకున్న భవంతిలో రెండున్నర కోట్ల రూపాయల కరెన్సీ, భారీయెత్తున బంగారం, పిస్టల్స్, ఇతర ఆయుధాలు దొరకడం దిగ్భ్రాంతికరం. నేరస్తుల కదలికలున్నాయని అనుమానం వచ్చినప్పుడూ, తాగి వాహనాలు నడుపుతున్నవారిని పట్టుకోవడానికీ పోలీసులు రాజధాని నగరంలోనూ, పట్టణాల్లోనూ తరచుగా రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తుంటారు.
ఇవిగాక పోలీసులకు సంబంధించిన నిఘా వ్యవస్థలు అనేకానేకం ఉంటాయి. నిరంతర సమాచార సేకరణే వీటి పని. అనేక హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలవంటి వందకు పైగా కేసులున్న వ్యక్తి ఈ స్థాయిలో డబ్బు, మార ణాయుధాలు కోరుకున్నచోటకు చేర్చుకోగలిగాడంటే...ఆ సంగతి పోలీసు యంత్రాంగానికి తెలియలేదంటే వింతగాదా? నయీంకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అతని కోసం ఎన్‌ఐఏ గాలిస్తున్నదని వార్తలొచ్చాయి. అదే నిజమైతే ఈ ఆపరేషన్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అలా చేయగలిగి ఉంటే అతని నుంచి ఎంతో విలువైన సమాచారం వెల్లడయ్యేది. ఇన్నాళ్లూ పట్టుకోలేకపోవడం ఎంత తప్పో, ప్రాణహాని లేకుండా అదుపులోకి తీసుకోలేకపోవడమూ అంతే దోషం. దేశ ప్రయోజనాలు, భద్రత పరిరక్షించ వలసినవారు అత్యంత మెలకువతో, చాకచక్యంతో వ్యవహరించి ఉండాల్సింది. కనీసం అతని అనుచరులనుంచి అయినా లోతైన సమాచారాన్ని రాబట్టగలిగితే మంచిదే.
నయీం ఎన్‌కౌంటర్
Published Tue, Aug 9 2016 12:55 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement