పఠాన్‌కోటలో కొత్త పాఠాలు | new lessons in patan kot issue | Sakshi
Sakshi News home page

పఠాన్‌కోటలో కొత్త పాఠాలు

Published Sun, Jan 17 2016 12:37 AM | Last Updated on Sat, Sep 15 2018 8:44 PM

పఠాన్‌కోటలో కొత్త పాఠాలు - Sakshi

పఠాన్‌కోటలో కొత్త పాఠాలు

విశ్లేషణ
 సైన్యంలోకి విదేశీ శక్తులు, దేశద్రోహులు ఇప్పటికీ ప్రవేశించగలుగుతున్నాయంటే భారత భద్రతా వ్యవస్థ ఏ మేరకు పటిష్టంగా ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లొసుగులను అధిగమించడం తక్షణ కర్తవ్యం. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లను అరికట్టేందుకు సింగపూర్, ఇజ్రాయెల్ తరహాలో ‘ఫర్హీన్ లేజర్ వాల్’ ప్రతిపాదనను అమలు చేయాలి.

 పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వాయుసేన స్థావరం మీద జరిగిన ఉగ్రదాడి సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. దేశాన్నీ, అంతర్జాతీయ సమాజాన్నీ కలవరపాటుకు గురిచేసిన ఆ ఉదంతం, అనంతరం రేగుతున్న దుమారం ఒక పార్శ్వం. సైన్యంలో ఇంటిదొంగలు ఎక్కువై, కీలక రక్షణ సమాచా రాన్ని శత్రుదేశాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు మరో పార్శ్వం. భద్రతా వ్యవస్థలో లొసుగులు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయలేమి వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.

ఈ నేపథ్యంలో దేశ భద్రత మీద ఆందోళనలు వ్యక్తం కావడం ఆశ్చర్యం కాదు. దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశిం చారన్న సమాచారాన్ని పఠాన్‌కోట్ దుర్ఘటన జరగటానికి రెండు రోజుల ముందే కేంద్ర నిఘా వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశాయి. దాంతో, ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన మాట నిజం. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నూతన సంవత్సరం తొలి రోజు, వేకువన ఆరుగురు ముష్కరులతో కూడిన ఆత్మాహుతి దళం అత్యాధునిక మందుగుండుతో విరుచుకుపడింది. రెప్పపాటు వ్యవధే అయినా ఆ  స్థావరానికి రక్షణగా ఉన్న సైనికులు చూపిన ఉదాసీనత, లేదా మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉగ్రవాదులు చొరబడేటందుకు దోహదం చేశాయి. అయితే, భారత సైనిక దళాలు వీరోచితంగా పోరాడాయి. ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతం కాగా, ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. మన సైనికుల తెగువను అభినందించవలసిందే.

దాడి గురించి భిన్నస్వరాలు  
 దాడి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌తో నెరపుతున్న దౌత్యనీతి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత గడ్డ మీద ఉగ్రవాదాన్ని తుద ముట్టించేంత వరకూ పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ప్రయోజనం లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగమంత్రి యశ్వంత్‌సిన్హా  వ్యాఖ్యానించారు. రక్షణమంత్రి మనోహర్ పారికార్ ‘దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని హెచ్చరించారు. అది ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి చేసిందా? లేక పాకిస్తాన్‌ను ఉద్దేశించి చేసిందా? స్పష్టత లేదు. పారికార్ వ్యాఖ్యలకు భిన్నమైన పంథాను  హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుసరించడం కూడా చర్చనీయాంశమే.

దాడి వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, అప్పుడే ఆ దేశాన్ని వేలెత్తి చూపడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఎన్డీఏ వైఖరి కూడా అదే. తొందరపడి నిందించే బదులు, పాక్ సహకారంతోనే అక్కడ తిష్ట వేసిన ‘జైష్ ఏ మహ్మద్’ వంటి ఉగ్రవాద సంస్థల ఆట కట్టించవచ్చునన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తున్నది.  ఇది యూపీఏ పంథాకు భిన్నం కాదు. కాకపోతే, నాడు యూపీఏని తప్పు పట్టిన బీజేపీ, ఇప్పుడు అదే పంథాను అనుసరించడమే చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నంత మాత్రాన తెగతెంపులు చేసుకోరాదన్నది అంతర్జాతీయ దౌత్యనీతి సూత్రం. అందువల్ల, పాక్ మీద చర్యకు భారత్ పూనుకోవడం సరికాదు.

 ప్రమాదకర ఆపరేషన్లు
 ఇటీవలి కాలంలో భారత రక్షణ దళాల్లోకి శత్రువులు పెద్ద సంఖ్యలో చేరడం, కొంతమంది సైనికులు, అధికారులు ప్రలోభాలకు లొంగి సమాచారాన్ని వెల్లడిం చడం ఎక్కువయిందనే అభిప్రాయం తరచూ వినబడుతున్నది. పఠాన్‌కోట్ ఉదంతం తర్వాత, దేశద్రోహం అభియోగం మీద వైమానిక దళానికి చెందిన నలుగురు అధికారులను నిర్బంధించారు. ఇంటి దొంగల కారణంగానే ఉగ్రవాదులు పఠాన్‌కోట్ స్థావరంలోకి ప్రవేశించగలిగారనేదే అభియోగం. హతమైన ఉగ్రవాదుల వద్ద పఠాన్‌కోట్ నగర మ్యాప్, స్థావరం మ్యాప్‌లు దొరకడంతో.. ఇంటిదొంగలే వారికి ఉప్పందించారన్నది బహిర్గతమయింది. అంతకు ముందే ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని సైనికస్థావరాల్లోకి, పోలీసు ఠాణాల్లోకి దర్జాగా చేరిపోయారు. కోవర్ట్ ఆపరేషన్లతో తీరని నష్టం కలిగించారు. అయితే ప్రలోభపరిచి కీలక సమాచారాన్ని సేకరించడం కొత్త సంస్కృతి కాదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ, అమెరికా) శత్రుదేశాల్లో కల్లోలం సృష్టించ డానికి ఏజెంట్లను పంపిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాలను బలహీన పరిచేందుకు ‘సీఐఏ’ నిరంతరం పనిచేసింది.

అనేక దేశాల రాజకీయ, సైనిక సంక్షోభాలలో ‘సీఐఏ’దే ప్రధాన పాత్ర అన్న ఆరోపణలు లేకపోలేదు.  ఇప్పుడు ఆ పోకడ భారతదేశంలో తలెత్తడం ఆందోళన కలిగిస్తు న్నది. పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులు కొందరు ‘ఐఎస్‌ఐ’తో కుమ్మక్కయి, రహస్యాలను చేరవేస్తున్నారని విమర్శ. గత మూడేళ్లలో ఇలా కుమ్మక్కయిన 34 మందిని నిఘా విభాగం అరెస్ట్ చేసిందని ఇటీవల రాజ్యసభలో ప్రభుత్వమే ప్రకటించింది కూడా.  కానీ ఎవరో కొందరు దేశద్రోహానికి ఒడిగడితే ఆ తప్పును మొత్తం వ్యవస్థకు  ఆపాదించడం సమంజసం కాదు. అనేక వ్యవస్థలు కాలక్ర మేణా బలహీనపడినప్పటికీ, భారత సైన్యం మాత్రం క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరుగా నిలిచింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, అఫ్ఘానిస్తాన్‌ల సరిహద్దుల వెంబడి సుమారు 15,000 కిలోమీటర్ల మేర నిరంతరం భద్రతా దళాలు గస్తీ కాస్తుంటాయి. ప్రాణాలను పణంగా పెట్టి భారత సైనికులు విధులు నిర్వహిస్తున్నందునే దేశప్రజలు నిశ్చింతగా జీవించగలుగుతున్నారు. సరిహద్దుల్లో భద్రతాదళాలు ఎదుర్కొం టున్న సమస్యలు, ఇబ్బందుల్ని తల్చుకొంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. హిమాల యాలలో, లేహ్, సియాచిన్ వంటి ప్రాంతాలలో రాత్రింబవళ్లు సైనికులు విధి నిర్వహణలో ఉంటారు. దట్టమైన అటవీప్రాంతాల్లో,  ‘ధార్ ఎడారి’ లాంటి ప్రాంతాల్లో నిరంతరం దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

 దేశానికి నూతన సవాళ్లు  
 గత ఆరున్నర దశాబ్దాల కాలంలో ఒకసారి 1962లో చైనాతో, 1947లో జరిగిన యుద్ధం సహా నాలుగు సార్లు పాకిస్తాన్‌తో భారత్ యుద్ధానికి తలపడింది. చైనా యుద్ధంలో భారతదేశానికి అపార నష్టం వాటిల్లినా  విజయతీరాలకు చేరింది. 1965 నాటి పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. 1971లో బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) ను విముక్తం చేయడానికి పాకిస్తాన్‌తో చేసిన యుద్ధంలోనూ మన సైన్యం విజయం సాధించింది. ‘ఆపరేషన్ విజయ్‌గా’ పేర్కొనే 1990 నాటి ‘కార్గిల్ యుద్ధం’లో భారత్ విజయం చిరస్మరణీయం. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలంక ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు టైగర్లను ఏరివేసేందుకు.. ‘ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్’ (ఐపీకేఎఫ్) పేరుతో భారత సైన్యం వెళ్లింది. అయితే శ్రీలంకకు ఐపీకేఎఫ్‌ను పంపడం రాజీవ్ తప్పిదమన్న వాదన లేకపోలేదు. రాజీవ్ తీసుకున్న నిర్ణయం ఆయన ప్రాణాలనే కబళించింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా అమృత్‌సర్‌లోని స్వర్ణాలయం మీద జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో కూడా సైన్యం విజయం సాధించింది. ఖలిస్థాన్ ఉద్యమం సమసిపోయింది.

 ప్రపంచ దేశాల్లో సైనిక బలం పరంగా భారతదేశానికి 3వ స్థానం. మన త్రివిధ దళాలలో సుమారు 13 లక్షల 25 వేల మంది మిలటరీ, లక్షా16 వేల మంది రిజర్వ్ దళాలు, 13 లక్షల మంది పారా మిలటరీ దళాలు.. వీరుకాక.. సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ దళాలు.. ఇంకా అనుబంధ వైద్య, ఇంజనీరింగ్ విభాగాలలో పని చేసే వారు ఉంటారు.  80వ దశకం నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత  సైన్యానికి పెనుసవాల్‌గా మారింది. 1984 నుంచి నేటి వరకు భారత్‌లో జరిపిన ఉగ్రవాదుల దాడులలో 1,920 మంది జవాన్లు వీరమరణం పొందారని గణాం కాలు వెల్లడిస్తున్నాయి.  కశ్మీర్   ఈనాటికీ రగులుతూనే ఉంది.  కారణం- పాకి స్తాన్‌లో ఏర్పడుతున్న ప్రభుత్వాలు పేరుకే ప్రజా ప్రభుత్వాలు. సైన్యమే పాల కులను నియంత్రిస్తుంది. 1999లో అప్పటి  ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాక్‌తో సఖ్యతను ఆశించారు. చరిత్రాత్మక లాహోర్  బస్సుయాత్ర చేశారు. కానీ, ఈ సఖ్యత గిట్టని శక్తులు కార్గిల్ యుద్ధానికి తెగబడ్డాయి. ఇప్పుడు చరిత్ర పునరావృతమయింది. ప్రధాని మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదిన వేడు కకు లాహోర్ వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే పఠాన్‌కోట్ ఉదంతం జరగటం యాదృ చ్ఛికం కాదు. తాజాగా పఠాన్‌కోట్ ఘాతుకం నేపథ్యంలో ‘జైషే మహ మ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాక్’’ అతని సోదరుడు, మరి కొందరు ఉగ్రవాదులను పాక్ అరెస్ట్ చేయడమే కాక పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల్ని ఏరివేయాలని, ఈ ప్రయత్నంలో భారత్‌తో కలిసి పనిచేయాలని సంకల్పించడం ఇరుదేశాల దౌత్య సంబంధాలు మెరుగుపడాలనే కోణంలో హర్షించదగ్గదే. అయితే అది కార్య రూపం దాల్చాలి.

 మరింత పటిష్టం చేయాలి
 దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా  సైనికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారింది. వారిని అమరవీరులుగా కీర్తించడంతోనే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. సైన్యంలోకి విదేశీ శక్తులు, దేశద్రోహులు ఇప్పటికీ ప్రవేశించగలుగుతున్నాయంటే భారత భద్రతా వ్యవస్థ ఏ మేరకు పటిష్టంగా ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లొసుగులను అధిగమించడం తక్షణ కర్తవ్యం. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లను అరికట్టేందుకు సింగపూర్, ఇజ్రాయెల్ తరహాలో  ‘ఫర్హీన్ లేజర్ వాల్’ను నిర్మించాలన్న ప్రతిపాదనను ఇప్పటికైనా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. భారత్- పాక్‌ల మధ్య 15 శాతం మేర, బంగ్లాదేశ్ సరిహద్దులో 25 శాతం మేర సరిహద్దు ఫెన్సింగ్ వేయవలసి ఉంది. కాగా చైనా సరిహద్దులో ఎక్కువ భూభాగానికి ఇప్పటికీ ఫెన్సింగ్ లేదు. సైన్యంలో ఇంటిదొంగల భరతం పట్టేందుకు ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలను మరింత పటిష్టం చేయాలని ‘జీపీ సక్సేనా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను కూడా తక్షణం పరిగణలోకి తీసుకోవాలి. పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడంతోపాటు  దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం ద్వారానే  దేశంలో ఉగ్రవాద చర్యలను అరికట్టడం సాధ్యం. అన్నింటికీ మించి అంతర్జాతీయంగా అన్ని దేశాల సమష్టి చర్యకు కూడా సమయం ఆసన్నమైందనే వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి.

http://img.sakshi.net/images/cms/2015-10/51444879381_Unknown.jpg
    (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి:  డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు   సెల్ : 99890 24579)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement