ఆధిపత్య చరిత్రకు భిన్నమైన జనచరిత్ర | special interview with professor Jayadheer Tirumala rao | Sakshi
Sakshi News home page

ఆధిపత్య చరిత్రకు భిన్నమైన జనచరిత్ర

Published Sun, Feb 12 2017 4:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

ఆధిపత్య చరిత్రకు భిన్నమైన జనచరిత్ర

ఆధిపత్య చరిత్రకు భిన్నమైన జనచరిత్ర

చెమట చుక్కల్లోనే శ్రమ సౌందర్యం ఉంటుంది. ఆ శ్రామిక జన జీవనంలోంచి ఉట్టిపడేదే కళ, సాహిత్యం, సంస్కృతీ. తరాల అంతరాల్లో అధఃపాతాళాల లోలోపలికి తొక్కివేసిన చరిత్ర అణచే కొద్దీ ఉబికి ఉబికి వస్తుంది. అదే అసలైన చరిత్రగా పరిణామ క్రమం రుజువు చేస్తుంది. అతికొద్ది మంది ఆధిపత్యం కింద అప్పటి వరకూ పడి నలిగిన అస్పృశ్య చరిత్ర శతాబ్దాల సమాధు లను తొలుచుకొని మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతుంది.

చితికిన సిబ్బి రేకుల్లోంచి, నలిగిన కాగితపు చుట్టల్లోంచి, నేత గాళ్ల గుడ్డపటాల్లోంచి, గుర్రపువారి మాలల చరిత్రలోంచి, సుద్దాల హను మంతు పాటలోంచి, స్వాతంత్య్ర సమరగీతాల్లోంచి, నిషిద్ధ సాహిత్యం వరకు మూడున్నర దశాబ్దాల పాటు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు జనం గుండెల్లోంచి ఏరుకున్న దగాపడ్డ జన సంస్కృతీ ఆనవాళ్ళనే ఈనెల 12 నుంచి 14 వ తేదీ వరకు రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు. జాన పదకళల అధ్యాపకులు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు ముప్ఫయ్‌ ఐదేళ్ల సుదీర్ఘ కృషి గమనాన్నీ, గమ్యాన్నీ ఆయన మాటల్లోనే చూద్దాం.

ఈ ప్రదర్శన లక్ష్యం ఏమిటి?
రాజుల చరిత్రలో లోపాలుండొచ్చు. కానీ సామాన్యుల చరిత్రను మసిబార్చొద్దు. ప్రజా సంస్కృతే అంతిమ ప్రత్యామ్నాయమని నేటితరం అర్థం చేసుకోవాలి. మన ముందున్నది కేవలం 20 శాతం ఆధిపత్య వర్గాల చరిత్ర, సంస్కృతి మాత్రమే. మిగిలిన 80 శాతం జనచరిత్రను గుర్తించాలన్నదే నా లక్ష్యం. రాజులు తమకు తాముగా నిర్దేశించేది శాసనం. అదే అగ్రహారాల ఆధిపత్య సంస్కృతి. అందులో విజయాలు, లెక్కలు మాత్రమే ఉంటాయి అపజయాల గాయాలను అది లెక్కించలేదు. కానీ ప్రజలు లిఖిం చుకున్న శాసనాలు ప్రజలందరికీ సంబంధించినవిగా ఉంటాయి. అటువంటి వాటిని మనం విస్మరించకూడదన్నదే నా అభిమతం.

ఈ ప్రదర్శనతో మీరు జనం ముందుంచదల్చిన అంశాలేమిటి?
జనచరిత్రను చాటిచెప్పే చారిత్రక ఆధారాలు. అవి రాగి రేకులు కావచ్చు, తెగ ముద్రలు కావచ్చు. తాళపత్ర గ్రంథాలు కావచ్చు. కాగితపు చట్టాల్లో దాగిన సామాన్యుల చరిత్ర కావచ్చు. నేత పటాల్లో చిత్రించిన కులపురాణాలు కావచ్చు. ఉపకులాల చరి త్రను విప్పి చెప్పే ఇత్తడి పలకలపైనున్న రాతప్రతులు కావచ్చు. నకాశీ చిత్రకారుల కళాకృతులు కావచ్చు. ఒరేచర్‌ అంటే ఓరల్‌ లిటరేచర్‌ కావచ్చు, గుజిలీ ప్రతులు (జానపద పుస్తకాలు) కావచ్చు, స్వాతంత్య్ర కాలంలో నిషేధానికి గురైన సాహిత్యం కావచ్చు, గోండులిపి ప్రతులు కావచ్చు, మందహెచ్చు బొమ్మలు కావచ్చు, కోయ ఆదివాసీల పడిగెలు కావచ్చు. అన్నీ జనచరిత్రకు ఆధారాలే.
ప్రజలకు రాయడం వచ్చు. పాడడం వచ్చు. బొమ్మలు చిత్రిం చడం వచ్చు. అయితే ఆయా దశల్లో వారికి తెలిసిన కళ ద్వారా ఆనాటి చరిత్రను ముద్రించారు వారు. వివిధ వస్తువులుగా ఉన్న వాటినే ప్రజల నుంచి సేకరించాను. వాటిని ప్రదర్శించడం ద్వారా వారి చరిత్రను గుర్తుచేయడమే నా లక్ష్యం.

ఎటువంటి చరిత్ర మీరు సేకరించిన ఆధారాల్లో దాగివున్నది?
మనం కనీవినీ ఎరుగని మానవ సమూహాలు ఈ సమాజంలో ఉండేవి. అవి చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. కానీ ఇప్పటికీ అలాంటి వేలాది సమూహాలు, కులాలు, తెగలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అవన్నీ సంచార జాతులే. వాళ్ళని ఈ దేశంలో చరిత్రకారులని కాదు కదా కనీసం మనుషులని కూడా ఎవ్వరూ గుర్తించకపోవడం శోచనీయం.

మీ సేకరణలో దళిత, ఆదివాసీ మహిళలకు చెందిన చరిత్ర ఉందా?
కోయల పడిగెలు (పటం – ఇది చిత్ర రూపంలో ఉంటుంది). ఇది 300 ఏళ్ళ క్రితం నాటి చరిత్ర. ఇందులో సమ్మక్క, సారక్కలాంటి మహిళల పోరాట చరిత్రను పటాల్లో చిత్రీకరించారు. కోయల చరిత్రలో సమ్మక్క, సారక్కతో పాటు చెక్కుచెడాలమ్మ, గుజ్జేటి మూసలమ్మ, బాపనమ్మ లాంటి మహిళల చరిత్రలున్నాయి.

ఈ చారిత్రక ఆధారాల్లో స్త్రీపురుష అసమానతలున్నాయా?
నాటి సమాజంలో హెచ్చుతగ్గుల్లేవు. స్త్రీలని తక్కువ చేసి చూసే లక్షణం లేదు. తగ్గించి చూసే లక్షణం చరిత్రకారులకుంటుంది ప్రజలకు కాదు. ఆ సమాజంలో అలాంటి భావన లేదు. స్త్రీల చరిత్రలన్నీ కూడా పోరాట చరిత్రలే. వాటికి ప్రజాజీవనంతో సంబంధం ఉంటుంది. ఇంకా బయటకు రాని స్త్రీజాతి చరిత్ర లెన్నిటినో తవ్వితీయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆ అంత రాన్ని పూరించాలి. అప్పుడు చరిత్రకు సమగ్రత లభిస్తుంది.

అణచివేతకు గురైన వర్గాల చరిత్ర సజీవంగా ఉండాలంటే ఏం చేయాలి?
నేను సేకరించినవి వస్తు సామగ్రి. అంతే. కానీ అవి మ్యూజి యంలో వస్తువులు కారాదు. షోకేసుల్లో బొమ్మలు అసలే కాకూ డదు. యివన్నీ ఆ ప్రజలకు సంబంధించిన సజీవ సంప్రదా యాలు. వాటిని వారిదగ్గర నుంచి చూసినప్పుడే దాన్లో జీవం ఉంటుంది. ఆ చరిత్ర గుర్తింపబడటం అంటే వారి కళలను, వారి సాంప్రదాయాలను, వారి చారిత్రక సంస్కృతినీ కాపాడటం, వాటిని కొనసాగించడం, వాటిని నమ్ముకుని జీవిస్తున్న వారికి తోడ్పాటునందించడం.

(సెంటర్‌ ఫర్‌ దళిత్‌ – ఆదివాసీ స్టడీస్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ (సీడీఏఎస్‌టి) యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌  ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ నెల 12 నుంచి 14 వరకు.. ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు సేకరించిన జనసంస్కృతీ ఆనవాళ్ల ప్రదర్శన సందర్భంగా)

ఇంటర్వ్యూ: అత్తలూరి అరుణ, సాక్షి ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement