అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ
కొలిమిగుండ్ల: కనకాద్రిపల్లెలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గతేడాది డిసెంబర్ 2న ఆలయాన్ని ప్రారంభించారు. మెయిన్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్న ఈ ఆలయానికి నిర్వాహకులు పూర్తి స్థాయిలో లైటింగ్ సౌకర్యం కల్పించారు. దుండగులు తాళాలు బద్దలు కొట్టి హుండీని తీసుకెళ్లారు. ఆలయం ఎదురుగా ఇంటిపై నిద్రిస్తున్న సోమశేఖర్ దంపతులు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వగా అందరూ కలిసి వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. సుమారు అర కిలో మీటర్ దూరంలో కంప చెట్ల చాటున హుండీని పగుల కొట్టి నగదు ఎత్తుకెళ్లారు. రూ.20 వేలకు పైగానే నగదు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఏఎస్ఐ ఉస్మాన్ఘని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన ఘటనపై విచారణ చేపడతామని ఏఎస్ఐ పేర్కొన్నారు.