ఆపరేషన్ ధూల్‌పేట్ సక్సెస్!
- గుడుంబా రహిత జిల్లాగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్ మినహా ఏ జిల్లాలోనూ గుడుంబా లేదంటున్నారు ఆబ్కారీ అధికారులు. ఆదిలాబాద్ మొదలుకొని ఖమ్మం వరకు ఇప్పటికే 8 జిల్లాలు గుడుంబా రహితమైనవిగా అక్కడి కలెక్టర్లు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ కూడా ఆ జిల్లాల సరసన చేరబోతోంది. ధూల్‌పేటలో నాటుసారా తయారీ, అమ్మకాలు లేకుండా చేస్తే మాత్రం అది గొప్ప విజయమే.
అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి చెబుతున్నారు. ఆదివారం(నేడు) గాంధీ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి టి. పద్మారావు సమక్షంలోనే జిల్లా కలెక్టర్ హైదరాబాద్‌ను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించనున్నారు.
ఐదు నెలల్లో నెరవేరింది...
ప్రభుత్వం ఏడాది క్రితం గుడుంబా రహిత రాష్ట్రంగా చేయాలని నడుం బిగించింది. ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ దీనిపై భారీ కసరత్తు జరిపి, పకడ్బందీ ప్రణాళికతో హైదరాబాద్, వరంగల్ మినహా 8 జిల్లాల్లో ఫలితాలు సాధించారు. అనంతరం గత మే నెలలో ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుడుంబా నిర్మూలన కోసం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ నంద్యాల అంజిరెడ్డికి ప్రత్యేక బాధ్యత అప్పగించారు. ఆయన ఈఎస్, డీసీలతో కలసి పక్కా ప్రణాళికతో ఐదు నెలల్లోనే ఫలితాలను సాధించారు.