గురప్పస్వామి ఆలయాన్ని సందర్శించిన ఏసీ
పోరుమామిళ్ల: మండలంలోని ప్రముఖ దర్శనీయ క్షేత్రమైన శ్రీ మద్దిమాను గురప్పస్వామి ఆలయాన్ని శుక్రవారం దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకరబాలాజీ సందర్శించారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై విచారణ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన కార్యనిర్వాహణాధికారి మారుతీప్రసాద్ను ఆలయ విస్తీర్ణం, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, భక్తులు నిర్మించిన సత్రాలు, గదులు, అన్నదానం, నెలవారీ వేతనాలు, ఇతర ఖర్చులు, సంవత్సరంలో ఆలయం వద్ద నిర్వహించే పర్వదినాలు, వసతులు తదితర అనేక అంశాల గురించి ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ వచ్చారన్న విషయం తెలిసిన గురప్పగారిపల్లె ప్రజలు, కొంతమంది భక్తులు అక్కడకు చేరుకుని ఈఓపై ఫిర్యాదు చేశారు. అన్నదానానికి, ఆలయ పూజలకు చేసిన ఖర్చుకంటే రెండింతలు, మూడింతలు అదనంగా ఖర్చు రాసి ఈఓ స్వాహా చేస్తున్నారన్నారు. తలనీలాలు రూ.9.5 లక్షలకు వేలం పాడితే రద్దుచేసి, ఆ తరువాత ఎవ్వరికీ తెలియకుండా రూ. 6 లక్షలకే వేలం ఖరారు చేశారని ఆరోపించారు. ఆలయ ఆవరణలోకి పందులు, మేకలు, గేదెలు ప్రవేశించి చెట్లు నాశనం చేస్తున్నాయని, ఆలయ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు.