కొత్తతరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం: ఇదం కౌటిల్యం...
మంచి పుస్తకం
డబ్బు లేనిదే జగత్తు లేదు. అలాగే జగత్తు లేకపోతే డబ్బూ ఉండదు. డబ్బు ఉండాలంటే జగత్తు సక్రమమైన చక్రాల మీద నడవాలి. వ్యవస్థ సజావుగా సాగాలి. పరిపాలనా విభాగాలు తమ విధులను తు.చ. తప్పకుండా నెరవేర్చాలి. ప్రభువు వీటన్నింటినీ సమర్థంగా అజమాయిషీ చేయాలి. ప్రజలు అందుకు తోడ్పడాలి. అప్పుడే డబ్బు ఉన్న ప్రపంచమూ, ప్రపంచంలోని డబ్బూ పరస్పరం సహకరించుకుంటూ మానవ జీవనాన్ని సుఖమయం చేస్తాయి. ఇది కనిపెట్టిన పూర్వీకులు అనేక ఆర్థిక గ్రంథాలను, స్మృతులనూ రాశారు. రాజుల చేత వాటిని శాసనస్థాయిలో అమలు పరిచేలా చూశారు. అయితే క్రీ.పూ.370 కాలానికి చెందినట్టుగా భావిస్తున్న కౌటిల్యుడు తన అర్థశాస్త్రంతో వీటన్నింటి అవసరం లేకుండా చేశాడు. ఆయన తన ముందుకాలం నాటి ఆర్థిక, ప్రవర్తనా నియమావళులన్నింటినీ క్రోడీకరించి వాటిలోని ముఖ్యవిషయాలతో పాటు తాను చెప్పవలసిన విషయాలను కలిపి అర్థశాస్త్రం రచించాడని అంటారు. కౌటిల్యుడే చాణక్యుడు అని ఎక్కువమంది భావించినా ఇరువురూ వేరు వేరు అనే అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకూ కౌటిల్యుని అర్థశాస్త్రం కేవలం భారతదేశాన్నే కాదు ప్రపంచ ఆర్థిక ప్రవీణులను కూడా ఆకర్షిస్తూనే ఉంది. ప్రతీ తరం ఇందులో నుంచి గ్రహించవలసింది ఎంతో ఉంది. అందుకే ప్రసిద్ధ ఆర్థికరంగ నిపుణులు కె.నరసింహమూర్తి నేటి యువతరం కోసం కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కీలకాంశాలను సులభరీతిలో ఈ గ్రంథంలో విశదపరిచారు. ఒక ప్రముఖ దినపత్రికలో కాలమ్గా వెలువడి ఆదరణ పొందిన వ్యాసాల సమాహారం ఈ పుస్తకం.
కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి చెబుతున్నామంటే కేవలం డబ్బు గురించి మాట్లాడుతున్నట్టుగా పొరపడరాదు. ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజారక్షణ, దేశరక్షణ, దండనీతి వీటన్నింటినీ ప్రభువులతో పాటు పౌరులు కూడా తెలుసుకొని ఎలా మసలుకోవాలో విడమర్చే శాస్త్రం ఇది అనంటారు నరసింహమూర్తి. ఇవాళ యువత పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్లడం వ్యాపార సంస్థలు నడపడం చూస్తాం. అంటే వారు రాజు/పాలక స్థానంలో ఉన్నవారి కిందే లెక్క. వీరు తమ కింద పని చేసే ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరించాలి? ‘ప్రజలు ఆనందంగా ఉంటేనే రాజు ఆనందంగా ఉంటాడు’ అంటాడు కౌటిల్యుడు. ‘న్యాయబద్ధంగా అందాల్సినవారికి అందకుండా చేసి వారిలో అసంతృప్తి పెంచడం కంటే ప్రమాదం లేదు’ అని కూడా అంటాడు. ఇవన్నీ పాఠాలు. ఇలాంటి తెలుసుకోవలసిన అనేక అంశాలను గ్రంథకర్త నరసింహమూర్తి 43 వ్యాసాలలో వివరించారు. ఈ పోటీ యుగంలో ఏ రంగంలో అయినా శత్రువులు తప్పరు. అట్టి శత్రువులతో వ్యవహరించడం ఎలాగో కూడా ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. మంచి ప్రయత్నం చేసిన నరసింహమూర్తి అభినంద నీయులు.
- డి.కృష్ణమూర్తిడ
ఇదం కౌటిల్యం
కె.నరసింహమూర్తి
(9652544432)
ఎమెస్కో ప్రచురణ
వెల: రూ.75 ప్రతులకు:
040 - 23264028