రక్తాన్ని వదలట్లేదు
ఇది కూడా కల్తీయే
► పాలల్లో నీళ్లు కలిపినంత సులభంగా రక్తం కల్తీ...
► సెలైన్ వాటర్ కలిపి విక్రయం
► మామూళ్ల మత్తులో ఔషధ నియంత్రణ మండలి
► ఇబ్బడిముబ్బడిగా బ్లడ్ బ్యాంకుల మంజూరు
► ఒకే వ్యక్తికి ఐదారు రక్తనిధి కేంద్రాల కేటాయింపు
► రక్తదాన శిబిరాలు నిర్వహించకుండానే.. భారీ నిల్వలు
► ‘ఉచిత’ శిబిరాల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు నిఘా లేక అడ్డగోలు దందాలు
గ్రేటర్లో రక్తనిధి కేంద్రాలు: 60కి పైగా ∙దందా జరుగుతున్నది: ముగ్గురి చేతుల్లో... రోజుకు సగటున అవసరమైన రక్తం: 1000 యూనిట్లు ∙ప్రస్తుతం లభిస్తున్నది: 300 యూనిట్లు కల్తీ ఇలా: 60 శాతం రక్తంలో 40 శాతం సెలైన్ వాటర్ ∙ఒక్కో బాటిల్‌పై కమీషన్: 300400 రూపాయలు నిబంధనల ప్రకారం ఒక్కో బాటిల్ ధర: రూ.1450 ∙కార్పొరేటర్ ఆస్పత్రులు చార్జి చేస్తున్నది: రూ.3000
సిటీలో ఉప్పు, పప్పు, పాలు, నీళ్లే కాదు...చివరకు రోగులకు పునర్జన్మను ప్రసాదించే రక్తం కూడా కల్తీ అవుతోంది. ధనాశతో కొందరు పాలల్లో నీళ్లు కలిపినంత సులభంగా రక్తంలో సెలైన్ వాటర్ కలిపి అమ్మేస్తున్నారు. రోగికి రెండు యూనిట్ల రక్తం ఇస్తే..అందులో ఒక యూనిట్ ఖచ్చితంగా కల్తీ (హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది) రక్తం బాటిలే ఉంటుంది. ఎప్పటికప్పుడు రక్తనిధి కేంద్రాలపై దాడులు నిర్వహించి, రక్త సేకరణ, వాటి నిల్వలు, నాణ్యతను పరీక్షించాల్సిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. రక్తనిధి కేంద్రాల్లో నిల్వలపై ఆన్లైన్ నిఘా లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సిటీబ్యూరో: కల్తీ రక్తం కారణంగా..అది ఎక్కించుకున్న రోగి కోలుకోక పోగా..ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతున్నాడు. వాస్తవంగా దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభిజిస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ చేసి ఆర్డీపీ, పీఆర్పీ, ఎస్ఎస్పీ, హోల్‌బ్లడ్, రెడ్ సెల్స్‌గా విభజిస్తారు. కేన్సర్ బాధితులకు, డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికి వైట్‌సెల్స్(ఆర్డీపీ, పీఆర్పీ) ఎక్కిస్తారు. ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి ఎస్ఎస్పీ సెల్స్, ప్రసవసమయంలో తీవ్ర రక్తస్త్రావంతో బాధపడుతున్న బాలింతలు, క్షతగాత్రులు, బైపాస్ సర్జరీ బాధితులు, ఇతర సర్జరీల బాధితులకు హోల్ బ్లడ్ ఎక్కిస్తారు. రక్తహీనతతో బాధపడే వారికి రెడ్‌బ్లడ్ సెల్స్‌ను ఎక్కిస్తారు. రక్తంలో ఎలాంటి పదార్థాలు కలుప కూడదు. కానీ నగరంలో రోజుకు సగటున 1000 యూనిట్ల అవసరం కాగా, 300 యూనిట్లకు మించి లభించడం లేదు. రోగుల నిష్పత్తికి తగినంత రక్తం లేక పోవడంతో బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు.
ప్యాకెట్లోని కొంత రక్తాన్ని సిరెంజ్ ద్వారా తీసి మరో ఖాళీ బ్యాగ్‌లో నింపుతున్నారు. రక్తంలో నార్మల్ సెలైన్ కలిపి పరిమాణంలో తేడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. యూనిట్ రక్తంలో 60 శాతం రక్తం ఉంటే..40 శాతం సెలైన్ కలుపుతున్నారు. కల్తీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం వల్ల అది ఎక్కించిన రోగి త్వరగా కోలుకోకపోగా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురువుతున్నారు. ఇటీవల సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలు మృతి చెందడానికి, బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఓ యువతి చేయి, కాలును కోల్పోవడానికి ఈ కల్తీ రక్తమే ప్రధాన కారణం. నిబంధనల ప్రకారం రక్తాన్ని రోగికి ఎక్కించే ముందు పరీక్షించాల్సి ఉంది. కానీ నగరంలో ఒకటి రెండు ఆస్పత్రులు మినహా ఎక్కడా పరీక్షలు జరపడం లేదు.
ఒక్కొక్కరి చేతిలో ఐదారు కేంద్రాలు...
ఔషధ నియంత్రణ మండలి అవినీతికి అడ్డాగా మారింది. అడిగినంత ఇస్తే చాలు ఒక్కో వ్యక్తికి ఐదారు రక్తనిధి కేంద్రాలు మంజూరు చేస్తుంది. కిలోమీటర్ పరిధి లోనే ఐదారు బ్లడ్ బ్యాంకులకు అనుమతి ఇస్తుండటమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక బ్లడ్ బ్యాంక్ నిర్వహించడమే కష్టం. కానీ నగరంలోని కొంత మంది సామాజికసేవ ముసుగులో రక్తంతో వ్యాపారం చేస్తున్నారు. దాతలు ఇచ్చిన రక్తం భారీగా లాభాలు తెచ్చిపెడుతుండటంతో ఒక్కరే ఐదారు బ్లడ్ బ్యాంకులను చేజిక్కించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 60కిపైగా రక్తనిధి కేంద్రాలు ఉండగా, వీటిలో సింహభాగం ముగ్గురు వ్యాపారుల చేతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ట్రస్టుల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి...దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంక్‌లకు తరలిస్తున్నారు. రోగులను తమ రక్తనిధి కేంద్రాలకు పంపిన ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్హోమ్స్లోని వైద్యులకు ఒక్కో బాటిల్‌పై రూ.200 నుంచి రూ.400 వరకు కమీషన్ ఇస్తుండటం విశేషం.
కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల తీరు మరో విధంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్న బాధితునికి అవసరమైన గ్రూప్ రక్తం కావాలంటే...రోగి బంధువుల్లో ఎవరో ఒకరు వచ్చి తమ రక్తాన్ని ఆస్పత్రికి దానం చేయాల్సిందే. దానం చేసిన రక్తాన్ని ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం ఒక్కో యూనిట్ రక్తం ధర రూ.1450 కాగా...కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం రూ.మూడు వేలకు పైగా ఛార్జీ చేస్తుండటం కొసమెరుపు.
రక్తం కల్తీతో ప్రాణాలకు ముప్పు
ఒక హోల్ బ్లడ్ ప్యాకెట్ 300 ఎంల్ నుంచి 350 ఎంఎల్ (సీపీడీఏ సొల్యూషన్) వరకు ఉంటుంది. రక్తంలో 45 శాతం ఎర్రరక్త కణాలు, 55 శాతం ప్లాస్మా(నీరులాంటి ద్రవ పదార్థం) ఉండాలి. అంతేకాదు 12.5 శాతానికి పైగా హీమోగ్లోబిన్ ఉండాలి. కానీ నగరంలోని కొన్ని బ్లడ్‌బ్యాంక్‌లు యూనిట్లో 60 శాతం రక్తాన్ని..40 శాతం సెలైన్ వాటర్‌తో నింపి అమ్ముతున్నాయి. రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటంతో రెండు మూడు రోజుల్లో కోలుకోవాల్సిన వారు వారం దాటినా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. అంతే కాదు కల్తీ రక్తం ఎక్కించడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. రక్తనిధి కేంద్రంలోని కొంత మంది చేస్తున్న ఈ తప్పుడు పనుల వల్ల నిజాయితీతో పనిచేస్తున్న వైద్యులు బదనాం అవుతున్నారు.
– డాక్టర్ గోవర్దన్, జనరల్ ఫిజీషియన్, కేర్ ఆస్పత్రి