హైదరాబాద్ : పాలు...నీళ్లు...ఉప్పు..పప్పులే కాదు చివరకు మనుషుల ప్రాణాలను కాపాడే రక్తాన్ని కూడా వదలడం లేదు. పాలల్లో నీళ్లుపోసి అమ్మినంత సులభంగా రక్తంలో సెలైన్‌వాటర్ కలిపేస్తున్నారు. ఒక పాకెట్ రక్తాన్ని రెండు ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. అక్రమార్కుల రక్తదాహానికి అమాయకులు బలవుతున్నారు. రక్త సేకరణ, శుద్ధి, భద్రపరచడంలో సరైన ప్రమాణాలు పాటించక పోవడమే కాకుండా దాతల నుంచి రోగులు సమకూర్చుకున్న రక్తాన్ని సైతం కల్తీ చేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తంలో నార్మల్ సెలైన్ వాటర్ కలిపి కల్తీ చేయడమే కాకుండా వాటికి స్టిక్కర్లు అతికించి విక్రయిస్తుండటం సంచలనం సృష్టించింది.
ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న నరేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ కల్తీ రక్తం వ్యాపారం బ్లడ్‌బ్యాంక్ వాలంటరీ అసోసియేషన్ సహకారంతో గురువారం బయటపడింది. అధికారుల ఫిర్యాదు మేరకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు, పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా నకిలీ గుట్టు రట్టైంది. నరేంద్రప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.