కల్తీనెయ్యి స్థావరంపై పోలీసుల దాడి
* 1500 కిలోల డాల్డా స్వాధీనం
* మూడు వేల కిలోల పామాయిల్,
* 600 కిలోల కల్తీ నెయ్యి కూడా..
శామీర్పేట్: రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం తూంకుంటలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై గురువారం పోలీసులు దాడి చేశారు. 1500 కిలోల డాల్డా, మూడు వేల పామాయిల్ ప్యాకెట్లు, 600 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎస్ఓటీ సీఐ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. తూంకుంట గ్రామానికి చెందిన వీర్రాజు తన ఇంట్లో (ప్లాట్నంబర్ 4-23/5/3లో కొంతకాలంగా యశోద, కృష్ణ, శ్రీలక్ష్మీఫుడ్స్ కంపెనీ పేరుతో నకిలీ నెయ్యి తయారుచేసి అమ్ముతున్నాడు.
దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు గురువారం వీర్రాజు ఇంటిపై దాడులు చేశారు. కల్తీనెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడి కావడంతో స్థావరాలను సీజ్ చేశారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1500 కిలోల డాల్డా, మూడు వేల కేజీల పామాయిల్, 600 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. 12 సంవత్సరాలుగా కల్తీనెయ్యి దందా జరుగుతున్నట్టు తయారీదారులు చెప్పారని సీఐ తెలిపారు.
పోలీసులు దాడిచేసిన సమయంలో కల్తీ నెయ్యి తయారీదారు వీర్రాజు ఇంట్లో లేకపోవడంతో అతడి కుమారులు భరత్, అలోక్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని శామీర్పేట్ పోలీసులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. దాడిలో ఎస్ఓటీ ఎస్ఐ వసంత్, శామీర్పేట్ సీఐ సత్తయ్య, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.