advertise
-
జోరుగా వినోద, మీడియా రంగం
న్యూఢిల్లీ: భారత వినోద, మీడియా రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2018 కల్లా ఈ రంగం రూ.2.27 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని సీఐఐ-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు, టీవీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి దీనికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ఇండియా ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2014 పేరుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ప్రైస్‌వాటర్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు.. 2013లో భారత వినోద, మీడియా రంగం టర్నోవర్ రూ.1.12 లోల కోట్లని అంచనా. 2013-18 కాలానికి 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందన్నది నివేదిక అంచనా. టెలివిజన్ పరిశ్రమలో వృద్ధి జోరు కొనసాగుతుంది. చందా ఆదాయాలు భారీగా పెరిగే అవకాశాలుండడమే(ఏడాదికి 15 శాతం వృద్ధి) దీనికి ఒక కారణం. ఇంటర్నెట్ అందుబాబులోకి రావడం, ఇంటర్నెట్లో ప్రకటనల ఆదాయం.. వీటి జోరు బాగా ఉంది. మొదటిది 47 శాతం, రెండోది 26 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధిస్తాయి. భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే. 2013లో రూ.35,000 కోట్లుగా ఉన్న ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 2018 నాటికి 13% చక్రగతి వృద్ధితో రూ.60,000 కోట్లకు పెరుగుతుంది. {పింట్ మీడియాను ఇంటర్నెట్ అధిగమిస్తుంది. {పకటనల ఆదాయం అధికంగా టీవీ, ప్రింట్ మీడియాలకే అందుతుంది. 2013 నాటికి రూ.12,600 కోట్లుగా ఉన్న చిత్ర పరిశ్రమ టర్నోవర్ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. దేశీయంగా, విదేశాల్లో కూడా సినిమా హాళ్ల ద్వారానే కాకుండా కేబుల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం కూడా పెరుగుతుంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం పెరుగుతుండడంతో గేమింగ్ రంగం ఆదాయం కూడా పెరుగుతుంది. -
బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలపై జాగ్రత్త
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్ఎస్ కార్యవర్గ కమిటీ సోమవారమిక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇక ఏటీఎంలలో ప్రకటనలు..!
న్యూఢిల్లీ: ఏటీఎంల వద్ద భద్రత తప్పకుండా పెంచా ల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇందుకయ్యే వ్యయాలను సమీకరించుకునేందుకు బ్యాంకులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎంలలో కూడా ప్రకటనలు ఉంచడం, విత్‌డ్రాయల్ చార్జీలు పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. బెంగళూరు ఏటీఎంలో ఒక మహిళపై ఉన్మాది దాడి ఉదంతంతో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ సెంటర్లలో భద్రత చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో వీటిలో సెక్యూరిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతేడాది నవంబర్ ఆఖరు నాటి లెక్కల ప్రకారం మొత్తం 1.40 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటన్నింటిలో నిఘా కెమెరాలు (లోపల, బైట), సమీప పోలీస్ స్టేషన్‌ని అప్రమత్తం చేసేలా అలారమ్‌లు మొదలైనవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే సుశిక్షితులైన సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. ఇంత భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడమన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, బ్యాంకులు ఇందుకు నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. బీమా, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు మొదలైన వాటి ప్రకటనలను ఏటీఎంలలో ప్రదర్శించడం ద్వారా కొంత మేర ఆదాయం సమకూర్చుకోవచ్చని బ్యాం కులు భావిస్తున్నాయి. ఇక ఉచిత లావాదేవీల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్తున్నాయి. సొంత బ్యాంకు ఏటీఎంలలో సైతం ఉచిత లావాదేవీలను ఐదుకు పరిమితం చేయడంపైనా బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలు వాడితే తప్ప ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి పరిమితీ లేదు. మరోవైపు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను పరిమితికి మించి వాడితే విధించే సర్వీస్ చార్జీలను కూడా రూ. 15 నుంచి రూ. 18కి పెంచడాన్నీ బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. దీంతో పాటు ఏటీఎం-కమ్-డెబిట్ కార్డుల వార్షిక మెయింటెనెన్స్ ఫీజులనూ పెంచాలని యోచిస్తున్నాయి.