ఇక ఏటీఎంలలో ప్రకటనలు..!
న్యూఢిల్లీ: ఏటీఎంల వద్ద భద్రత తప్పకుండా పెంచా ల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇందుకయ్యే వ్యయాలను సమీకరించుకునేందుకు బ్యాంకులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎంలలో కూడా ప్రకటనలు ఉంచడం, విత్‌డ్రాయల్ చార్జీలు పెంచడం వంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. బెంగళూరు ఏటీఎంలో ఒక మహిళపై ఉన్మాది దాడి ఉదంతంతో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ సెంటర్లలో భద్రత చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో వీటిలో సెక్యూరిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతేడాది నవంబర్ ఆఖరు నాటి లెక్కల ప్రకారం మొత్తం 1.40 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటన్నింటిలో నిఘా కెమెరాలు (లోపల, బైట), సమీప పోలీస్ స్టేషన్‌ని అప్రమత్తం చేసేలా అలారమ్‌లు మొదలైనవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే సుశిక్షితులైన సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. ఇంత భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడమన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, బ్యాంకులు ఇందుకు నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.
బీమా, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు మొదలైన వాటి ప్రకటనలను ఏటీఎంలలో ప్రదర్శించడం ద్వారా కొంత మేర ఆదాయం సమకూర్చుకోవచ్చని బ్యాం కులు భావిస్తున్నాయి. ఇక ఉచిత లావాదేవీల సంఖ్యను కూడా తగ్గించాలని యోచిస్తున్నాయి. సొంత బ్యాంకు ఏటీఎంలలో సైతం ఉచిత లావాదేవీలను ఐదుకు పరిమితం చేయడంపైనా బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలు వాడితే తప్ప ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి పరిమితీ లేదు. మరోవైపు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను పరిమితికి మించి వాడితే విధించే సర్వీస్ చార్జీలను కూడా రూ. 15 నుంచి రూ. 18కి పెంచడాన్నీ బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. దీంతో పాటు ఏటీఎం-కమ్-డెబిట్ కార్డుల వార్షిక మెయింటెనెన్స్ ఫీజులనూ పెంచాలని యోచిస్తున్నాయి.