డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔట్‌డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్ మీడియా సంచలనం సృష్టిస్తోంది. కంపెనీ ఏర్పాటైన రెండేళ్లలోనే అన్ని మెట్రో నగరాల్లో 3,200 పైచిలుకు స్క్రీన్లతో విస్తరించింది. యాపిల్, ఆడి, మలబార్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రకటనలను డిజిటల్ తెరలపై టీ–హబ్, డీఎల్ఎఫ్, లోధా, హైహోమ్, అరబిందో, ఇనార్బిట్ తదితర వందలాది గృహ సముదాయాలు, కమర్షియల్ ప్రాజెక్టులు, మాల్స్‌లో ప్రదర్శిస్తోంది.
భారత్‌లో ఔట్‌డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచామని బెల్ ప్లస్ మీడియా కో–ఫౌండర్లు గాయత్రి రెడ్డి చప్పిడి, దేవ్ అభిలాష్ రెడ్డి కొత్తపు తెలిపారు. ఏడాదిలో 20,000 స్క్రీన్లు, 20 నగరాలకు చేరుకోవాలన్నది లక్ష్యమన్నారు.
తొలిసారిగా..: రెండు డిస్ప్లేలతో దేశంలో తొలిసారిగా స్క్రీన్లను ఏర్పాటు చేశామని గాయత్రి వివరించారు. ‘అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో వినూత్న అనుభూతి, అతి తక్కువ ఖర్చు, సౌకర్యంతోపాటు ప్రకటనలను కస్టమైజ్ చేసుకునే వీలుండడం వల్లే సక్సెస్ అయ్యాం. స్క్రీన్కు ఉండే సెన్సార్‌తో ఎంత మంది వీక్షించారో తెలుసుకోవచ్చు. పైన ఉండే డిస్ప్లేలో బ్రాండ్ల ప్రకటనలు, కింది డిస్ప్లేలో సంబంధిత సొసైటీ నోటీసులు, అసోసియేషన్ సందేశాలు, కార్యక్రమాలు ప్రదర్శిస్తాం. సొసైటీలకు సేవలు ఉచితం. పైగా వారికి అద్దె చెల్లిస్తాం. క్లయింట్‌కు బెల్ ప్లస్ అప్లికేషన్ ఇస్తాం. ప్రకటనల కంటెంట్‌ను వారే ఎంచుకోవచ్చు’ అని తెలిపారు.