Aerocity Hotel
-
భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:ఏరోసిటీ కమర్షియల్ డెవలప్మెంట్ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్ డిస్ట్రిక్ట్స్ డిజైన్, డెవలప్, ఫైనాన్స్, కన్స్ట్రక్ట్, ఆపరేట్, మేనేజ్, మెయింటెయిన్ ప్రాతిపదికన ఫేజ్–1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్–2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్–1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036 వరకు ఏటా డీఐఏఎల్కు రూ.363.5 కోట్లను భారతీ రియల్టీ చెల్లించనుంది. దీనితోపాటు అదనంగా రూ.1,837 కోట్లు వన్ టైం పేమెంట్ చేయనుంది. గడువు మరో 30 ఏళ్లు పొడిగించినట్టయితే భారతీ రియల్టీ వార్షిక లీజు మొత్తంపై 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. భారతీ రియల్టీ ఫేజ్–2 ప్రాజెక్టు చేపట్టాలంటే ఫేజ్–1 మాదిరిగా అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. -
చెన్నైకి రెండో విమానాశ్రయం
సాక్షి ప్రతినిధి, చెన్నై : చెన్నైకి మరో విమానాశ్రయం ‘అక్కడ...కాదు ఇక్కడే’ అంటూ నాలుగేళ్లకు పైగా జరుగుతున్న చర్చకు దాదాపు తెరపడినట్లే. కాంచీపురం సెయ్యూరులో ఎట్టకేలకూ రెండువేల ఎకరాల స్థలాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎయిర్‌పోర్టు చుట్టూ ఏరోసిటీ ఏర్పాటుకు విమానయానశాఖ సమాయత్తం కావడం ద్వారా రెండో ఎయిర్‌పోర్టు సమాచారాన్ని ఖరారు చేసింది. విమాన చార్జీలు మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి రావడం, విమాన సంస్థలు అనేక రాయితీలతో మరింతగా ఆకర్షించడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగా విమానాల సేవలను విస్తరించారు. పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు మీనంబాక్కంలనే ఉన్నాయి. ప్రయాణం అంటే దాదాపుగా అందరికీ లగేజీ తప్పనిసరి కార్గోలో సైతం రద్దీ పెరిగిపోయింది. లగేజీని అప్పగించాలన్నా, డెలివరీ తీసుకోవాలన్నా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. రెండో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయకతప్పదనే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ఈ ఆలోచన వచ్చిన తరువాత మీనంబాక్కం ఎయిర్‌పోర్టును ఆనుకునే ఉన్న ప్రాంతాలైన పొళిచ్చూరు, అనకాపుత్తూరు, పమ్మల్, కౌల్బజార్లలోని నివాసప్రాంతాలను ఖాళీ చేయించి విస్తరించాలని తీర్మానించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లిపోయేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించింది. మరో ప్రయత్నంగా మధురాంతకం, ఉత్తరిమేరూరు ప్రాంతాలను పరిశీలించి 1500 ఎకరాలను విమానయానశాఖ అధికారులు ఎంపికచేశారు. అయితే కొన్ని కారణాలవల్ల రెండో ప్రయత్నానికి కూడా స్వస్తిపలికారు. ఇక ఆ తరువాత చెన్నైకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరంబుదూరును పరిశీలించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో 1250 ఎకరాలు ఎంపికచేసి విరమించారు. మొత్తం మీద ఐదోప్రయత్నంగా కాంచీపురం జిల్లా మధురాంతకం సమీపం సెయ్యూరు తాలూకాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం రెండువేల ఎకరాలను రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. ఈ రెండువేల ఎకరాల్లో మూడు పెద్ద గ్రామాలు, రెండు కుగ్రామాలు ఉన్నాయి. అరప్పోడు, ఆయకున్రం గ్రామాల పేర్లను మాత్రమే అధికారులు బైటపెట్టారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పడినట్లయితే సెయ్యూరు నుంచి చెన్నైకి రెండుగంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్ల ప్రకారం రెండువేల ఎకరాల కొలతలకు ఎంపీపీ పుస్తకాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. సర్వే ముగిసిన తరువాతనే స్థల సేకరణ పనులను ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయివేటు, ప్రభుత్వ స్థలాలు కూడా కలిసి ఉన్నాయి. సెయ్యూరు పరిసరాలు ఓఎంఆర్, జీఎస్టీ రహదారులను కలుపుకుని ఉన్నందున చెన్నైకి సులభంగా చేరుకోవచ్చు. అయితే దూరం ఎక్కువగా ఉండటం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయవచ్చు. బెంగళూరు విమానాశ్రయంతో పోల్చుకుంటే నగరం సరిహద్దుల నుంచి 35 కిలోమీటర్లు, హైదరాబాద్ విమానాశ్రయంతో పోలిస్తే 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే చెన్నై నగరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సెయ్యూరు ఉంది. సెయ్యూరు–చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు చేస్తేనే విమానప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దూరాన్ని దృష్టిలో ఉంచుకుని సెయ్యూరులో అంతర్జాతీయ విమానాశ్రయం, మీనంబాక్కంను అంతరాష్ట్ర (డొమెస్టిక్) విమానాశ్రయంగానూ తీర్చిదిద్దాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే ఎయిర్‌పోర్టు కోసం ఎంపిక చేసిన ప్రాంత పరిసరాల్లో ఏరోసిటీ ఏర్పాటుకు విమానయానశాఖ సన్నాహాలు చేస్తోంది. -
ఉద్యోగిని చీర లాగాడు, సస్పెన్షన్ వేటు
ఢిల్లీ హోటల్లో మహిళా సిబ్బందిపై దారుణం సెక్యూరిటీ మేనేజర్ పై సస్పెన్షన్ వేటు న్యూఢిల్లీ: ఢిల్లీ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో మహిళా ఉద్యోగిని వేధింపుల వీడియో సంచలనంగా మారింది. సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగిని చీర పట్టుకుని లాగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఎరోసిటీ హోటల్ లో ఈ ఘటన గత నెల 29న చోటుచేసుకుంది. సెక్యూరిటీ మేనేజర్ పవన్ దహియా.. మహిళ ఉద్యోగిని చీర లాగి, బలవంతంగా తన ఒడిలో కూర్చుపెట్టుకునేందుకు యత్నించాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే స్టార్ హోటల్లో పని చేస్తున్న ఉద్యోగిని పట్ల పవన్ దహియా గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేస్తున్నాడు. అయితే అతని వేధింపులకు ఉద్యోగిని ఏమాత్రం లొంగలేదు. ఈ క్రమంలో జూలై 29న ఉద్యోగిని పుట్టినరోజు కావడంతో పవన్ దహియా..ఆమెను క్యాబిన్లోకి పిలిచి తన క్రెడిట్ కార్డు ఇచ్చి గిఫ్ట్ కొనుక్కోవాలని సూచించాడు. అయితే అందుకు ఉద్యోగిని అంగీకరించకపోవడంతో... ఆమె చీర పట్టుకొని లాగి తనపై కూర్చోమని బలవంతం చేశాడు. ఇదంతా గమనిస్తున్న మరో ఉద్యోగిని అక్కడినుంచి బయటకు వెళ్లమని పంపించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు అదేరోజు రాత్రి మానవ వనరుల విభాగానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తర్వాత రోజు ఉదయం ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు హెచ్ఆర్ నుంచి నోటీసులు ఇచ్చింది. అలాగే సెక్యూరిటీ మేనేజర్‌ను హోటల్ యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసింది. కాగా బాధితురాలు ఈ సంఘటనపై ఆగస్టు ఒకటో తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ... ‘రెండేళ్లుగా అక్కడ పని చేస్తున్నా. శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అతను నాపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆరోజు గదిలోకి పిలిచి నా చీర లాగాలని యత్నించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి చూస్తూనే ఉన్నాడు తప్ప స్పందించలేదు. నేనే అతన్ని అడ్డుకున్నా. సీసీ పుటేజీ వీడియోలను ఓ అధికారిణికి చూపించి, విషయంపై ఫిర్యాదు చేస్తే వార్నింగ్ లెటర్ తో సరిపెట్టారే తప్ప అతనిపై చర్యలు తీసుకోలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను.’ అని తెలిపింది. అయితే హోటల్ పీఆర్ అధికారి రాజా సింగ్ ఘటనపై స్పందిస్తూ సెక్యూరిటీ మేనేజర్ ను కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మహిళను తొలగించిన విషయంపై తనకు తెలియదని అతను చెప్పటం విశేషం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.