అయ్యో.. ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం..!
వరంగల్: తప్పుడు వ్యక్తులకు లోన్లు ఇచ్చాననే బాధతో ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం ఆత్మహత్య చేసుకున్న సంఘటన బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆంధ్రాబ్యాంకులో ఏజీఎంగా పనిచేస్తున్న కేఎం నాగరాజన్(59).. సోమవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది కిందటే కోల్ కతా నుంచి హన్మకొండకు బదిలీపై వచ్చిన ఆయన ఇవ్వాళ ఉదయం ఇంటి నుంచి కారులో బయటికొచ్చారు. వరంగల్ రైల్వేగేట్ వద్ద కారు పక్కకు ఆపి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే, సివిల్ పోలీసులకు నాగరాజన్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది.
కోల్ కతా బెల్లిగ్యాంగ్ పార్కు బ్రాంచ్ లో పనిచేసిన సమయంలో కొందరికి లోన్లు(రుణాలు) మంజూరు చేశానని, కానీ ఆ వ్యక్తులు తప్పుడస్తులని, ఇంత అనుభవం ఉండికూడా పొరపాటు చేసినందుకు బాధపడుతున్నట్లు నాగరాజన్ లేఖలో పేర్కొన్నాడు. బాధ తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, కొడుకులు కోడళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా భార్యకు సూచనలు చేశాడు.
నాగరాజన్ మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాము చెన్నైలోని మందెవైల్లి ప్రాంతానికి చెందినవారమని, కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు లేవని, అయితే బ్యాంక్ లోన్లకు సంబంధించి తన భర్త బాధపడుతూ ఉండేవాడని నాగరాజన్ భార్య రాధారాజన్ తెలిపారు. తమ ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారని పేర్కొన్నారు. నాగరాజన్ ఆత్మహత్యపై కేసు నమోదుచేసినట్లు వరంగల్ జీఆర్పీ రెండో ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.