AHTU
-
‘హైటెక్ సెక్స్‌రాకెట్’లో అసిస్టెంట్ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన హైటెక్ సెక్స్‌రాకెట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ) అరెస్టు చేసింది. ఈ కేసులో సురేశ్ బోయిన అనే టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పోలీసులకు చిక్కాడు. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను అక్రమంగా తరలించి వాట్సాప్ గ్రూప్‌లు, వెబ్సైట్లలో వారి ఫొటోలను పెట్టి, కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తూ స్టార్ హోటళ్లు, ఓయో రూమ్‌లలో వ్యభిచారదందా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు 33 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిలో బాలీవుడ్లో కథారచయిత ముంబైకి చెందిన మోహిత్ సత్పాల్ అలియాస్ గార్గ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మేకల అఖిల్‌కుమార్, నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన సురేశ్ బోయిన అలియాస్ కుమార్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై మాదాపూర్, పంజగుట్ట ఠాణాలో ఇప్పటికే నాలుగు కేసులున్నాయి. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్వైపింగ్ మెషీన్, పాస్‌పోర్ట్, ఆధార్, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ►బంజారాహిల్స్‌లోని హయత్ హైట్స్‌లో ఉండే సురేశ్ బోయిన ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సినీపరిశ్రమకే చెందిన నందు అనే వ్యక్తితో కలిసి సురేశ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారదందా మొదలుపెట్టాడు. ►పశ్చిమ బెంగాల్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సురేశ్ నమ్మించి మోడల్స్, సినీతారలను అక్రమంగా తరలించి హైదరాబాద్‌లోని పెద్దలకు పరిచయం చేసేవాడు. లొకాంటో, స్కోక్కా, బ్లాక్‌పేజ్ వంటి వెబ్సైట్లలో అమ్మాయిల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షించేవాడు. 35–40 శాతం కమీషన్ తీసుకొని మహిళలను సరఫరా చేసేవాడు. సురేశ్ ఈ దందాను కొంతకాలం గోవాలో కూడా నిర్వహించాడు. ఇప్పటివరకు 450–500 మంది బాధితులను వ్యభిచారకూపంలోకి దింపాడు. ►2019లో గచ్చిబౌలిలోని క్లబ్‌రోగ్ పబ్‌లో వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్న దీపక్ రాయ్‌తో అఖిల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అఖిల్ మాదాపూర్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని దందా మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే పోలీసులు దాడి చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి 400–500 మంది మహిళలను తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దింపి, హైదరాబాద్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తూ విటులను ఆకర్షించేవాడు. -
పదేళ్ల అన్వేషణకు తెర
నెల్లూరు (క్రైమ్): పదేళ్ల కిందట అదృశ్యమైన ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లల కేసును యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) పోలీసులు ఛేదించారు. వారిని తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అల్తుర్తికి చెందిన జయంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2012లో కనిపించకుండా పోయింది. అప్పట్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం ఎంత గాలించినా ఎలాంటి సమాచారం లభించకపోవటంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఎస్పీ సీహెచ్ విజయారావు ఇటీవల ఏహెచ్‌టీయూను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏహెచ్‌టీయూ ఎస్ఐ విజయశ్రీనివాస్ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. తప్పిపోయిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సదరు మహిళపై రేషన్‌కార్డు ఉండటాన్ని గుర్తించి, దాని ఆధారంగా ఆమె గుంటూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఎస్ఐ తన సిబ్బందితో గుంటూరుకు చేరుకుని జయంతి, ఆమె ఇద్దరు పిల్లలను తమ సంరక్షణలోకి తీసుకుని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఆదివారం పొదలకూరు పోలీసుస్టేషన్లో వారిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. -
మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్స్టేషన్ల తరహాలోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ)లకు పోలీస్‌స్టేషన్ హోదా కల్పించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూల ఏర్పాటుకు నిర్ణయించడం మరో విశేషం. అక్రమ రవాణాకు గురైన బాధితులను రక్షించేందుకు, అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆట కట్టించేందుకు హద్దులు, అడ్డంకులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఏహెచ్‌టీయూ బృందాలకు అధికారం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఏహెచ్‌టీయూలు ఉండగా.. కొత్తగా చిత్తూరు, తూర్పుగోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో పనిచేసే యూనిట్లను ఎస్పీలు, విజయవాడ, విశాఖలలో నగర పోలీస్ కమిషనర్లు నోడల్ ఆఫీసర్లుగా ఉండి పర్యవేక్షిస్తారు. అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ప్రతి యూనిట్‌కు ఒక సీఐ, ఇద్దరు చొప్పున ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. వీరికి మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ టీమ్‌లు స్థానిక దిశ పోలీస్‌స్టేషన్, సివిల్ పోలీసులను సమన్వయం చేసుకుని మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకుంటాయి. అంతేకాకుండా బాధితులకు పునరావాసం, సహాయం తదితర చర్యలు చేపట్టేందుకు మిగిలిన శాఖలను కూడా సమన్వయం చేసుకుంటారు. బాధితులకు తక్షణ న్యాయం దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూలు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. వీటికి పోలీస్‌స్టేషన్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కేసుల నమోదు, దర్యాప్తు వేగంగా జరిగి దోషులకు శిక్షలు పడతాయి. బాధితులకు తక్షణ న్యాయం, వారికి పునరావాసం, పరిహారం అందుతుంది. –ఎన్.రామ్మోహన్, హెల్ప్ సంస్థ -
కథ సుఖాంతం
► తల్లిదండ్రుల చెంతకు యువకుడు ► టూవీలర్ సర్వీసింగ్ సెంటర్లో పట్టుకున్న ►ఏహెచ్‌టీయూ అధికారులు శ్రీకాకుళం సిటీ: కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు తిరిగి ఇంటికి చేరలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వారు పోలీసులను ఆశ్రయించారు. స్వయంగా జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డిని కలిసి తప్పిపోయిన తమ కుమారుడి వివరాలను తెలియజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణాశాఖ(ఏహెచ్‌టీయూ) అధికారులు సమూలాగ్రం గాలించి ఆ యువకుని ఆచూకీ కనుగొన్నారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి... టెక్కలి మండలం కొడ్రవీధికి చెందిన మజ్జి సాయికుమార్ స్థానికంగా ఉన్న విశ్వసాయి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రోజులాగే కాలేజీకి వెళ్లివస్తానని చెప్పి గత నెల 13వ తేదీన ఇంటినుంచి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి రావల్సిన సాయి రోజులు గడుస్తున్నా రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సాయి తండ్రి ఎం.నారాయణరావు టెక్కలి పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 22వ తేదీన స్వయంగా జిల్లా ఎస్పీని కూడా కలిసి కుమారుడి అదృశ్యంపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్పీ యువకుడి ఆచూకీ కనుగొనాలని ఏహెచ్‌టీయూ అధికారులకు ఆదేశించారు. ఏఎస్ఐ పీవీ రమణ నేతృత్వంలో పీసీలు పి.జగదీష్‌కుమార్, ఆర్.భాస్కరరావు, డీసీపీవో రమణ యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సెల్ కాల్‌డేటా ఆధారంతో సాయికుమార్ ఎక్కడున్నది కనుగొన్న పోలీసులు ఎట్టకేలకు సింగుపురం అడ్డురోడ్డు వద్ద ఓ టూవీలర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న అతనిని పట్టుకున్నారు. స్థానిక ఏహెచ్‌టీయూ కార్యాలయంలో సాయికుమార్‌ను అతని తండ్రికి శనివారం అప్పగించారు.