కుటుంబ సభ్యులకు సాయికుమార్‌ను అప్పగిస్తున్న ఏహెచ్‌టీయూ అధికారులు
కథ సుఖాంతం
Published Sat, Aug 6 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
► తల్లిదండ్రుల చెంతకు యువకుడు
► టూవీలర్ సర్వీసింగ్ సెంటర్‌లో పట్టుకున్న
►ఏహెచ్‌టీయూ అధికారులు
శ్రీకాకుళం సిటీ: కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు తిరిగి ఇంటికి చేరలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వారు పోలీసులను ఆశ్రయించారు. స్వయంగా జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డిని కలిసి తప్పిపోయిన తమ కుమారుడి వివరాలను తెలియజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణాశాఖ(ఏహెచ్‌టీయూ) అధికారులు సమూలాగ్రం గాలించి ఆ యువకుని ఆచూకీ కనుగొన్నారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి... టెక్కలి మండలం కొడ్రవీధికి చెందిన మజ్జి సాయికుమార్ స్థానికంగా ఉన్న విశ్వసాయి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
రోజులాగే కాలేజీకి వెళ్లివస్తానని చెప్పి గత నెల 13వ తేదీన ఇంటినుంచి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి రావల్సిన సాయి రోజులు గడుస్తున్నా రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సాయి తండ్రి ఎం.నారాయణరావు టెక్కలి పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 22వ తేదీన స్వయంగా జిల్లా ఎస్పీని కూడా కలిసి కుమారుడి అదృశ్యంపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్పీ యువకుడి ఆచూకీ కనుగొనాలని ఏహెచ్‌టీయూ అధికారులకు ఆదేశించారు. ఏఎస్‌ఐ పీవీ రమణ నేతృత్వంలో పీసీలు పి.జగదీష్‌కుమార్, ఆర్.భాస్కరరావు, డీసీపీవో రమణ యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సెల్ కాల్‌డేటా ఆధారంతో సాయికుమార్ ఎక్కడున్నది కనుగొన్న పోలీసులు ఎట్టకేలకు సింగుపురం అడ్డురోడ్డు వద్ద ఓ టూవీలర్ సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అతనిని పట్టుకున్నారు. స్థానిక ఏహెచ్‌టీయూ కార్యాలయంలో సాయికుమార్‌ను అతని తండ్రికి శనివారం అప్పగించారు.
Advertisement