కొత్త ఏడాదిలోనూ నోట్ల కష్టాలు..
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు కష్టాలు వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఆలిండియా బ్యాంకు ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బ్యాంకుల వద్ద అప్పటి నుంచి ఇప్పటి వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది. నోట్ల కష్టాలపై ఇప్పట్లో ఉపశమనం కలిగే అవకాశం కనిపించడం లేదని, రద్దు చేసిన నగదులో 20-30 శాతం మాత్రమే ఆర్బీఐ ఇచ్చిందని వెంకటాచలం తెలిపారు.
కాగా ఈ నెలాఖరు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేయడానికి పరిమితులు చాలావరకు ఉండబోవని, కావల్సినంత మొత్తం తీసుకోవచ్చని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఇదంతా ఇప్పట్లో జరిగేలా లేదు. డిసెంబర్ 30 తర్వాత కూడా నోట్ల విత్డ్రా మీద పరిమితులు కొనసాగుతాయని ఆర్థికశాఖ వర్గాలు అంటున్నాయి. బ్యాంకులలో పని సక్రమంగా నడవాలంటే, ఈ పరిమితి కొన్నాళ్లు కొనసాగించక తప్పదని బ్యాంకర్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కరెన్సీ ఇంకా అంతగా అందుబాటులోకి రాలేదు. దాంతో నగదు కోసం సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు.