టాయోటా కార్ల భారీ రీకాల్
టోక్యో : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఎయిర్ బ్యాగ్ లో సాంకేతిక లోపం కారణంగా ఇటీవల భారీ ఎత్తున కార్లను వెనక్కి తీసుకుంటున్న సంస్థ మరోసారి పెద్ద ఎత్తున రీకాల్ చేపట్టింది. సుమారు 5 లక్షలకు పైగా వెహికల్స్ ను వెనక్కి తీసుకోనుంది.
జపాన్ టకట కార్పొరేషన్ చేసిన లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్స్ కారణంగా అమెరికాలో 5,43,000 వాహనాలను రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2006-2012 మధ్య తయారు చేసిన వివిధ మోడల్ కార్లలో సెడాన్ మరియు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలున్నట్టు చెప్పింది. అలాగే 2008-2009 సియోన్ ఎక్స్ బి , 2009 - 2012 కరోలా, కరోలా మ్యాట్రిక్స్ , యారిస్,సియన్నా , లెక్సస్ ఇతర వాహనాలు ఉన్నట్టు ప్రకటించింది. కాగా ఎయిర్ బ్యాగుల తయారీలో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ రసాయనం మూలంగా గతంలో అనేక పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 16 మంది చనిపోగా, 180 మందికి పైగా గాయపడ్డారు.