ఎయిర్పోర్టు మాకొద్దు
* రైట్స్ బృందాన్ని అడ్డుకున్న ఆదివాసీలు
* రోడ్డుపై బైఠాయింపు
కొత్తగూడెం : కొత్తగూడెం మండల పరిధిలోని పునుకుడుచెలకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన ఎయిర్పోర్ట్ను నిలిపివేయాలని కోరుతూ ఎయిర్పోర్టు సమగ్ర సర్వేకు వచ్చిన రైట్స్ బృందాన్ని ఆదివాసీలు శుక్రవారం అడ్డుకున్నారు. మర్రిగూడెం రోడ్డుపై బైఠాయించి సర్వే చేసి తిరిగి వస్తున్న బృందాన్ని నిలిపివేశారు. వివరాలిలా ఉన్నాయి. పునుకుడు చెలకలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం తరఫున రైట్స్ బృందం గ్రామానికి చేరుకుని, సర్వే నిర్వహించింది. అనంతరం బృందం సభ్యులు తిరిగి వసున్న క్రమంలో గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకులు అడ్డుకున్నారు.
మర్రిగూడెం రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వారు ఎంతకూ లేవకపోవడంతో త్రీ టౌన్ ఎస్సై అంజయ్య ఆందోళనకారుల వద్దకు వెళ్లి రైట్స్ బృందం కేవలం సర్వే మాత్రమే చేస్తోందని, ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారులకు చెప్పాలని సూచించారు. అయితే రైట్స్ బృందానికి తాము వినతిపత్రం అందిస్తామని, సర్వే నిలిపివేయాలని ఆదీవాసీ నాయకులు సూచించారు. వారితో నేరుగా మాట్లాడించాలని ఆదివాసీ ఐక్యకార్యచరణ సమితి జిల్లా కన్వీనర్ వాసం రామకృష్ణదొర, న్యూడెమోక్రసీ నాయకులు ఎల్.విశ్వనాథం డిమాండ్ చేశారు.
దీంతో రైట్స్ సర్వే బృందానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అబ్బాస్కుమార్ పటారియా ఆదివాసీ సంఘం నాయకులతో మాట్లాడారు. తాము తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేస్తున్నామని, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. అప్పటికీ గిరిజనులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఎస్సై అంజయ్య కలుగజేసుకుని ప్రస్తుతం ఎయిర్పోర్టుకు ఎలాం టి అనుమతులు రాలేదని, ఇది కేవలం సర్వే మాత్రమేనని నచ్చజెప్పారు. అభ్యంతరాలను రెవెన్యూ అధికారులకు తెలపాలని సూచించారు.