మహిళలకు సమాన వేతనం ఇవ్వాలి
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు
విజయవాడ (గాంధీనగర్) :
మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యన్యం, సమాన పనికి సమాన వేతనం లేకపోవడం దురదృష్టకరమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 12వ తేదీన రాష్ట్ర నిర్మాణ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ మాట్లాడుతూ ఆర్టికల్–14 ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఉండాలన్న నిబంధనను ప్రభుత్వాలు ఉల్లఘింస్తున్నాయన్నారు. అనంతరం వివిధ రంగాల నుంచి వచ్చిన మహిళలు తమ సమస్యలను వివరించారు. శ్రామిక మహిళా ఫోరం నాయకురాలు పి.సూర్యావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శారద, సరస్వతి, అంగన్వాడీ వర్కర్ యూనియన్ నేతలు జె.లలిత, భాగ్యలక్ష్మి, గంగావతి, గీతాభారతి తదితరులు పాల్గొన్నారు.