సినిమాలో మాదిరిగానే ఎస్ఐపై కాల్పులు
నోయిడా: కరడు గట్టిన నేరస్తులను అరెస్టు చేసేందుకు పోలీసుల బృందంతో వెళ్లిన సబ్ ఇన్ స్పెక్టర్‌ను దారుణంగా కాల్పులు జరిపి చంపిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడినవారు అనంతరం పారిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం సోమవారం వేకువ జామున గ్రేటర్ నోయిడాలోని దాద్రిలోగల నయి అబాది ఏరియాలో కరడు గట్టిన నేరస్తులు, పలు దొంగతనాల కేసులు ఉన్న ఫక్రాన్, జావేద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసేందుకు అక్తర్ ఖాన్(40) అనే ఎస్ఐ వెళ్లాడు. వారు ఉంటున్న ఇంటిపై రైడింగ్‌కు దిగారు. అనుమానితుల ఇంట్లోకి తొలుత ఎస్సై ఖాన్ ప్రవేశించాడు.
అతడు అలా అడుగుపెట్టాడో లేదో సినిమాలో చూపించినట్లుగా అతడిపై వరుసకాల్పులు జరిపారు. తొలిబుల్లెట్ అతడి మెడలోకి దిగడంతోనే ఆయన కుప్పకూలిపోయాడు. అంతలోనే బయట ఉన్న మిగితా పోలీసులు ఎదురు కాల్పులు జరిపినా.. నేరస్తులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఎస్సై ఖాన్ ను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఆయుధాల దొంగతనం, హత్యలు, దోపిడీల వంటి కేసుల్లో కాల్పులు జరిపిన వారిపై అభియోగాలు ఉన్నాయి. చనిపోయిన ఎస్ఐకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.