సింగపూర్‌లో అలసాని క్రిష్ణారెడ్డికి సత్కారం
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) వ్యవస్థాపక సభ్యులు అలసాని క్రిష్ణా రెడ్డిని సింగపూర్‌లోని అమరావతి రెస్టారెంట్లో సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండల కేంద్రం. క్రిష్ణా రెడ్డి సింగపూర్‌లో గత 15 సంవత్సరాలుగా నివసిస్తూ స్వదేశానికి తిరిగి వెళుతున్నారు. అయితే టీసీఎస్ఎస్ ఆవిర్భావం నుండి సొసైటీ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ సింగపూర్‌లోని తెలంగాణ వాసులకు, సొసైటీకి అందించిన సేవలకు గుర్తింపుగా సొసైటీ సభ్యులు వీడుకోలు విందును ఏర్పాటు చేసి అయన సేవలను కొనియాడారు. దాంతో పాటు సొసైటీ తరపున శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
సన్మాన సభను ఏర్పాటు చేసి సత్కరించినందుకుగానూ క్రిష్ణా రెడ్డి సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లోని తెలంగాణ వారికి టీసీఎస్ఎస్ ద్వార సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సింగపూర్‌లో గడిపిన సమయం మధుర స్మృతి అని, ఈ ప్రయాణంలో ఎంతో మంది మిత్రులు అయ్యారని తెలిపారు. ఎక్కడ ఉన్నా తెలంగాణ వాసులకు చేతనైన సహాయం చేస్తానన్నారు. సింగపూర్‌లో ఉన్న తెలంగాణ వారందరు టీసీఎస్ఎస్ సభ్యత్వం తీసుకొని సొసైటీ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయడానికి కృషి చేస్తున్న టీసీఎస్‌ఎస్‌కు సహకారం అందజేయాలని కోరారు.
ఈ సన్మాన సభలో ఉపాధ్యక్షులు నీలం మహేందర్, పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్ బాబు, ఇతర కార్యవర్గ సభ్యులు చిల్క సురేశ్, దుర్గ ప్రసాద్, ఎల్లా రాం రెడ్డి, పెద్దపల్లి వినయ్ కుమార్, సీహెచ్ ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గర్రేపల్లి శ్రీనివాస్, ఆర్. సి రెడ్డి, నల్ల భాస్కర్, పెరుకు శివ రాంలు పాల్గొన్నారు.