ఫ్రెండ్‌కి సెండాఫ్.. విషాద ఘటన
సాక్షి, హైదరాబాద్: మిత్రుడికి వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వీడ్కోలు చెప్పేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు విగతజీవులుగా మారిన విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద జరిగింది.
శామీర్‌పేట్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన పల్లవి గుప్త(22), చెన్నైకి చెందిన ఇందిరా వీణా(23), మహారాష్ట్రకు చెందిన కుశాల్ మండలంలోని జగన్‌గూడ గ్రామ పరిధిలోని నిక్మార్ (నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ రీసెర్చ్) కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తమ మిత్రుడు చిరంజీవి మహరాజ్‌ను కొంపల్లిలో నాగ్‌పూర్ బస్సు ఎక్కించి పల్లవి గుప్త, వీణాలు ఒక వాహనంపై కుశాల్ మరో వాహనంపై తిరిగి హాస్టల్‌కు వస్తున్నారు. శామీర్‌పేట్ మండల పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై యూటర్న్ తీసుకునేందుకు యత్నిస్తుండగా వెనుక నుండి అతివేగంతో వస్తున్న లారీ విద్యార్థుల రెండువాహనాలను వెనుక నుండి డీకొట్టింది. దీంతో పల్లవిగుప్త, వీణాలు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో వాహనంపై ఉన్న కుశాల్కుస్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది కుశాల్‌ను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న శామీర్‌పేట్ ఎస్ఐ నవీన్‌రెడ్డి, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన పల్లవిగుప్త, వీణ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ వివరాలు తెలుసుకునేందుకు అలియాబాద్ చౌరస్తా వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
విమానాల్లో మృతదేహాల తరలింపు
శామీర్‌పేట్: పల్లవిగుప్త, ఇందిరా వాణి మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వగా వారు రాలేని పరిస్ధితి ఉందని తెలపడంతో కళాశాల అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ సుబ్రమణ్యం, యాజమాన్యం వారి మృతదేహాలను విమానాల్లో వారి సోంత ప్రదేశాలకు తరలించారు.
ఫ్రెండ్‌కి సెండాఫ్.. విషాద ఘటన