‘షరియా’ నీడనే ముస్లిం మహిళలకు భద్రత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలు తమకు షరియా చట్టం నీడనే రక్షణ ఉంటుందని భావిస్తున్నారని, ఏకీకృత పౌరస్మృతిని వారు కోరుకోవడం లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. ఒక్క పర్సనల్ లా బోర్డ్ లేదా అందులోని మహిళలు మాత్రమే ఈ ఏకీకృత పౌరస్మృతిని వ్యతిరేకించడం లేదని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలు కూడా ఇదే నిర్ణయంతో ఉన్నారని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫరూకీ అన్నారు. వారంతా షరియా చట్టం ద్వారానే సురక్షితంగా ఉండగలమని భావిస్తున్నారని పేర్కొన్నారు.
ఏఐఎంపీఎల్బీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆస్మా జెహ్రా మాట్లాడుతూ.. ‘ముస్లిం పర్సనల్ లా’ రక్షించుకునేందుకు దేశంలోని ముస్లిం మహిళలందరూ కలసికట్టుగా ముందుకొస్తున్నారని చెప్పారు. ఇతర వర్గాలతో పోలిస్తే తమ మతంలోనే విడాకుల సంఖ్య చాలా తక్కువ అని తెలిపారు. విడాకుల తర్వాత కూడా అనేక హక్కులు ముస్లిం మహిళలకు వర్తిస్తాయని చెప్పారు. అంతేకాకుండా మళ్లీ వివాహం చేసుకొని నూతన జీవితాన్ని కూడా ఆరంభించొచ్చని వివరించారు. ఇది హిందూ, ముస్లింల సమస్య కాదని ప్రధాని మోదీ చెప్పిన మాట వాస్తవమేనని, ఇది కేవలం ఆరెస్సెస్ సమస్య మాత్రమేనని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసుపై విచారణ నడుస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించి, ఏకీకృత పౌరస్మృతిని అమలు చేయాలని పలు ముస్లిం మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు వారి డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏఐఎంపీఎల్బీ వివిధ రాష్ట్రాల్లో సంతకాల సేకరణ నిర్వహిస్తోంది.