Alluvial
-
ప్రమాదపు అంచున పాఠశాల
సాక్షి,బేతంచెర్ల : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన ఉన్న అయ్యలచెర్వు ప్రాథమిక పాఠశాల పరిసరాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 158 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి పరిశ్రమల నుంచి వచ్చే నాపరాయి వేస్టేజీ, ఒండ్రు మట్టిని పాఠశాల వెనక భాగాన తరలించి, అక్కడే డంప్ చేయడంతో.. ఆ ప్రాంతం పెద్ద కొండలా కనిపిస్తోంది. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువై నాపరాయి వేస్టేజీ కొండ కూలితే పాఠశాలపై పడే అవకాశం ఉంది. దానికితోడు, ఆ వేస్టేజీ రాళ్ల కింద ఉండే ఒండ్రుమట్టి పాఠశాల ఆవరణలోకి వచ్చి అసౌకర్యంగా దర్శనమిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి, నాపరాళ్లు, ఒండ్రుమట్టి వేస్టేజీని వేరే ప్రాంతానికి తరలించి, పాఠశాల ఆవరణాన్ని విద్యార్థులకు సౌకర్యంగా మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఒండ్రు మట్టితో భక్తుల ఇబ్బందులు
మంగపేట : మండల కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ప్రమాదం పొంచి ఉన్నప్పటికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అంత్య పుష్కర స్నానానికి వస్తున్న భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఐదు రోజుల నుంచి స్థానికులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు రోజుకు సుమారు 50 మంది వరకు మంగపేట పుష్కరఘాట్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. అయితే పుష్కరాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఘాట్ మెట్లపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించకపోవడంతో పుష్కరస్నానానికి నీటిలోకి దిగుతున్న భక్తులు జారిపడుతున్నారు. ఒండ్రుమట్టి కారణంగా కొందరు భక్తులు పుష్కరస్నానం చేయకుండా తలపై నీటిని చల్లుకుని వెళ్తుండగా.. మరికొందరు కర్రల సాయంతో నీటిలో మూడు మునకలు వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించి వెళ్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఘాట్ మెట్లపై పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు.