ambernath towns
-
శివరాత్రికి అంబర్నాథ్ శివాలయం మూసివేత
సాక్షి, ముంబై (మహారాష్ట్ర): కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అంబర్‌నాథ్‌లోని ప్రాచీన శివాలయాన్ని మహా శివరాత్రి (గురువారం) రోజున మూసి ఉంచాలని స్థానికులు, పూజారులు, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు పిండివంటలు, నైవేద్యాలతో ఆలయానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వినాయక్ నరళే విజ్ఞప్తి చేశారు. అందుకు అంబర్నాథ్, ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. అంతేగాకుండా కరోనా కారణంగా అంబర్నాథ్ సిటీలో జరిగే జాతర కూడా రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. జనాలు రాకుండా అంబర్నాథ్ మున్సిపల్ కూడా తమ వంతుగా కృషి చేయనుంది. వాహనాలు రాకుండా రహదారులపై బారికేడ్లు, డ్రమ్ములు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం దిశగా ఎవరు రావద్దని, ముఖ్యంగా భక్తులు పోలీసులకు, ఆలయ యాజమాన్యానికి సహకరించాలని వినాయక్ నరళే సూచించారు. ఇలా హిందువుల ప్రధాన పండుగ మహాశివరాత్రి రోజున ఆలయాన్ని మూసి ఉంచడం ఇదే ప్ర«థమమని పూజారులు తెలిపారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఎంతో నిష్ట, ఉపవాస దీక్షలతో ముంబై, ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి ఈ ప్రాచీన శివ మందిరాన్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మూసి ఉంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో.. ముంబై నుంచి సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న అంబర్నాథ్ పరిసర ప్రాంతంలో 961 ఏళ్ల కిందట ఈ శివాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ మందిరాన్ని రాజా మంబవాణీ నిర్మించారు. దీన్ని యునెస్కో కూడా గుర్తించి ప్రాచీన కట్టడాల జాబితాలో నమోదు చేసింది. అదేవిధంగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా ఈ మందిరం పేరు నమోదైంది. ఏటా మహా శివరాత్రి రోజున 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు దర్శనానికి వస్తారు. మహా శివరాత్రికి ఒక రోజు ముందు అంటే అర్ధరాత్రి 12 గంటలకు హారతులిచ్చి మందిరాన్ని తెరుస్తారు. భక్తుల దర్శనార్థం ఏకంగా 24 గంటలు మందిరాన్ని తెరిచే ఉంచుతారు. ఆ రోజు అంబర్నాథ్ సిటీలో జాతర ఉంటుంది. దీంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇదిలాఉండగా కరోనా కారణంగా గత సంవత్సరం మార్చిలో విధించిన లాక్డౌన్ వల్ల ఈ ఆలయాన్ని మూసివేశారు. కానీ, మిషన్ బిగిన్ ఎగైన్‌లో భాగంగా ఇటీవల భక్తుల కోసం మళ్లీ ఆలయాన్ని తెరిచారు. కానీ, రోజురోజుకు కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మందిరాన్ని మూసి ఉంచాలని నిర్ణయానికొచ్చారు. ఈ ఆలయంలో అనేక దశాబ్దాలుగా పూజలు చేయడం పారంపర్యంగా వస్తున్న అంబర్నాథ్ గ్రామానికి చెందిన పాటిల్ కుటుంబం, స్థానిక శివాజీనగర్ పోలీసు స్టేషన్ అధికారులు సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత ఆలయాన్ని మూసివేయాలని తుదినిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా ఆరోజు ఆలయానికి వచ్చే రహదారులన్నీ మూసివేయాలని నిర్ణయించారు. -
షాకింగ్; కేంద్ర మంత్రి చెంప చెళ్లు
థానే: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలేకి మహారాష్ట్రలోని అంబర్నాథ్ పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి ఓ అగంతకుడు ఆయనపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌నాథ్‌లో జరిగిన ఓ సభలో పాల్గొన్న అథవాలే.. కార్యక్రమం ముగిశాక కార్యకర్తలతో ముచ్చటించడం కోసం వేదిక కిందకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అథవాలే వైపు దూసుకొచ్చిన ఓ యువకుడు ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. అంతేకాకుండా ఆయనను తోసివేయడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అథవాలే భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆవేశంలో ఆర్పీఐ కార్యకర్తలు నిందితుడిపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. కాగా, ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఈ షాకింగ్ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అథవాలే ముంబైకి వెళ్లిపోయారు. అథవాలేపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో ముంబైలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఈ ఘటనపై ఆర్పీఐ నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. దీని వెనుక ఉన్నావారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అథవాలేపై దాడికి నిరసనగా ఆదివారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. -
విషవాయువులతో 400 మందికి అస్వస్థత
* రసాయనాల కంపెనీ నిర్వాకమని ఆరోపణ * శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన బాధితులు * పలు ఆస్పత్రుల్లో చికిత్స * సీరియస్‌గా ఉన్న ఇద్దరిని ముంబై తరలింపు * బాధితులకు పలువురు రాజకీయనాయకుల పరామర్శ * కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్,అంబర్నాథ్ పట్టణాలను విషవాయువులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు 400 మంది ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. రెండు పట్టణాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అంబర్నాథ్ ఎంఐడీసీలోని ఓ రసాయనాల కంపెనీకి చెందిన ట్యాంకర్‌లోని అపాయకరమైన రసాయనాలను అంబర్నాథ్ వడోల్ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న వాలధుని నదీలో శుక్రవారం అర్ధరాత్రి వదిలేశారు. దాంతో విషవాయువులు ఈ రెండు పట్టణాల్లో వ్యాపించాయి. వాటిని పీల్చిన వారికి ఒక్కసారిగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, కళ్లు మండటం, కళ్లు తిరగడం తదితర సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో శనివారం తెల్లవారుజాము సుమారు మూడు గంటల నుంచి వడోల్గావ్, సమ్రాట్ అశోక్‌నగర్, రేణుకా సొసైటీ, లాసీపాడా, పహలుమల్ కంపౌండ్, అయోధ్యనగర్ తదితర పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల ఏం జరిగిందో అర్థకం కాక అనేక మంది ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు స్వయంగా ఆస్పత్రుల్లో చేరగా మరికొందరిని తర్వాత సుమారు 25 అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. ఉల్లాస్నగర్లోప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చిన పలు అంబులెన్స్‌లు బారులు తీరిన దృశ్యమే పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టిందనవచ్చు. కాగా, బాధితుల్లో దీపక్ ముపే, హసీనా శేఖ్ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు వారిని ముంబైకి తరలించారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరగడంతో శివనేరి, శర్వానంద్, ఈఎస్ఐఎస్, త్రిమూర్తి మొదలగు ఆస్పత్రుల్లో చేర్పించారు. పరిస్థితి తెలుసుకున్న శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఉల్లాస్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్ బాలాజీ ఖతగావ్కర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ వసంత్ జాదవ్, ఉపజిల్లాధికారి చంద్రకాంత్ బోడారే, మేయర్ అపేక్ష పాటిల్, ఆర్పిఐ జిల్లా అధ్యక్షుడు నానా బాగుల్, ఎమ్మెన్నెస్ విద్యార్థి సేన జిల్లా ఉపాధ్యక్షుడు బండు దేశ్‌ముఖ్ తదితరులు బాధితులను పరామర్శించారు. ఈ విషయంపై హిల్‌లైన్ పోలీసు స్టేషన్, సెంట్రల్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.