సాక్షి, ముంబై (మహారాష్ట్ర): కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అంబర్‌నాథ్‌లోని ప్రాచీన శివాలయాన్ని మహా శివరాత్రి (గురువారం) రోజున మూసి ఉంచాలని స్థానికులు, పూజారులు, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు పిండివంటలు, నైవేద్యాలతో ఆలయానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వినాయక్ నరళే విజ్ఞప్తి చేశారు. అందుకు అంబర్‌నాథ్, ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. అంతేగాకుండా కరోనా కారణంగా అంబర్‌నాథ్ సిటీలో జరిగే జాతర కూడా రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. జనాలు రాకుండా అంబర్‌నాథ్ మున్సిపల్ కూడా తమ వంతుగా కృషి చేయనుంది.
వాహనాలు రాకుండా రహదారులపై బారికేడ్లు, డ్రమ్ములు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం దిశగా ఎవరు రావద్దని, ముఖ్యంగా భక్తులు పోలీసులకు, ఆలయ యాజమాన్యానికి సహకరించాలని వినాయక్ నరళే సూచించారు. ఇలా హిందువుల ప్రధాన పండుగ మహాశివరాత్రి రోజున ఆలయాన్ని మూసి ఉంచడం ఇదే ప్ర«థమమని పూజారులు తెలిపారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఎంతో నిష్ట, ఉపవాస దీక్షలతో ముంబై, ఉప నగరాలు, శివారు ప్రాంతాల నుంచి ఈ ప్రాచీన శివ మందిరాన్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మూసి ఉంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
60 కిలోమీటర్ల దూరంలో..
ముంబై నుంచి సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న అంబర్‌నాథ్ పరిసర ప్రాంతంలో 961 ఏళ్ల కిందట ఈ శివాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ మందిరాన్ని రాజా మంబవాణీ నిర్మించారు. దీన్ని యునెస్కో కూడా గుర్తించి ప్రాచీన కట్టడాల జాబితాలో నమోదు చేసింది. అదేవిధంగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా ఈ మందిరం పేరు నమోదైంది. ఏటా మహా శివరాత్రి రోజున 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు దర్శనానికి వస్తారు. మహా శివరాత్రికి ఒక రోజు ముందు అంటే అర్ధరాత్రి 12 గంటలకు హారతులిచ్చి మందిరాన్ని తెరుస్తారు. భక్తుల దర్శనార్థం ఏకంగా 24 గంటలు మందిరాన్ని తెరిచే ఉంచుతారు. ఆ రోజు అంబర్‌నాథ్ సిటీలో జాతర ఉంటుంది. దీంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు.
ఇదిలాఉండగా కరోనా కారణంగా గత సంవత్సరం మార్చిలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఈ ఆలయాన్ని మూసివేశారు. కానీ, మిషన్ బిగిన్ ఎగైన్‌లో భాగంగా ఇటీవల భక్తుల కోసం మళ్లీ ఆలయాన్ని తెరిచారు. కానీ, రోజురోజుకు కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మందిరాన్ని మూసి ఉంచాలని నిర్ణయానికొచ్చారు. ఈ ఆలయంలో అనేక దశాబ్దాలుగా పూజలు చేయడం పారంపర్యంగా వస్తున్న అంబర్‌నాథ్ గ్రామానికి చెందిన పాటిల్ కుటుంబం, స్థానిక శివాజీనగర్ పోలీసు స్టేషన్ అధికారులు సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత ఆలయాన్ని మూసివేయాలని తుదినిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా ఆరోజు ఆలయానికి వచ్చే రహదారులన్నీ మూసివేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment