
మహారాష్ట్రలో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి కాపలాగా నియమించిన వాచ్‌మ్యాన్ దొంగగా మారి, విలువైన ఆభరణాలు కొల్లగొట్టాడు.
వివరాల్లోకి వెళితే ఠాణే జిల్లాలోని కల్యాణ్‌ను ఆనుకునివున్న ఉల్లాస్‌నగర్ కాళీమాత ఆలయంలో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ వాచ్‌మ్యాన్ రమేష్ రావల్ తన స్నేహితునితో కలిసి 12 తులాల బంగారం దొంగిలించి పరారయ్యాడు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు రమేష్‌రావత్ తనతో పాటు ఆలయంలోని సీసీటీవీని కూడా ఎత్తుకెళ్లిపోయాడు.
ఈ ఘటనపై కళ్యాణ్‌లోని విఠల్‌వాడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి అనిల్ పడ్వాల్ ప్రత్యేక బృందాన్ని నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో బంగారం చోరీ కావడం స్థానికులను కలవరానికి గురిచేసింది. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
కాగా రమేష్ రావల్ మూడు రోజుల క్రితమే ఆలయ కాపలాదారుగా చేరాడు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కాళీమాత ఆలయం 65 ఏళ్ల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సూర్జిత్ బర్మన్ మాట్లాడుతూ నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు.