థానే: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలేకి మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి ఓ అగంతకుడు ఆయనపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌నాథ్‌లో జరిగిన ఓ సభలో పాల్గొన్న అథవాలే.. కార్యక్రమం ముగిశాక కార్యకర్తలతో ముచ్చటించడం కోసం వేదిక కిందకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అథవాలే వైపు దూసుకొచ్చిన ఓ యువకుడు ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. అంతేకాకుండా ఆయనను తోసివేయడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అథవాలే భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆవేశంలో ఆర్‌పీఐ కార్యకర్తలు నిందితుడిపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. కాగా, ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు.
ఈ షాకింగ్ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అథవాలే ముంబైకి వెళ్లిపోయారు. అథవాలేపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో ముంబైలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఈ ఘటనపై ఆర్‌పీఐ నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. దీని వెనుక ఉన్నావారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అథవాలేపై దాడికి నిరసనగా ఆదివారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment