republic party of india
-
మళ్లీ మేము అధికారంలోకి వస్తామో రామో కానీ..: నితిన్ గడ్కరీ
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తోటి కేబినెట్ మంత్రి, రామ్‌దాస్ అథవాలేను ఉద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి కేంద్రంలో తమ ప్రభుత్వం(బీజేపీ) వస్తుందో రాదో తెలియదు కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే మాత్రం కచ్చితంగా కేంద్రమంతి అవుతారనే హామీ ఇవ్వగలనని చమత్కరించారు.ఈ మేరకు నాగ్పూర్లోజరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. వివిధ ప్రభుత్వాలలో అథవాలే కేబినెట్ పదవులు చేపట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో స్టేజ్‌పై అథవాలే కూడా ఉండటం గమనార్హం. అనంతరం అథవాలేతో సరదాగా నవ్వుతూ తాను జోక్ చేశానని చెప్పుకొచ్చారు.అథవాలే కూడా నవ్వులు చిందించారు.ప్రస్తుతం గడ్కరీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా, రామ్‌దాస్ అథవాలే వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తన పరంపరను కొనసాగిస్తానని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో ఆర్పీఐ కూడా భాగం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడనుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆర్పీఐ(ఏ) కనీసం 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు అథవాలే పేర్కొన్నారు.. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర నాగ్‌పూర్, ఉమ్రేడ్ (నాగ్‌పూర్), యావత్మాల్లోని ఉమర్‌ఖేడ్, వాషిమ్‌తో సహా విదర్భలో మూడు నుంచి నాలుగు స్థానాలను అడుగుతామని చెప్పారు.కూటమిలో భాగమైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు తమ కోటా నుంచి తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని అన్నారు.చదవండి: ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు -
ప్యాకేజీకి ఒప్పుకున్నది చంద్రబాబే
సాక్షి, అమరావతి : ఆయనో దళిత ఉద్యమకారుడు. కార్మిక సంఘం నాయకుడిగా.. జర్నలిస్టుగా.. రాజకీయ నేతగా.. అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. వైఎస్సార్ సీపీ విజయం ఖాయం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబే కదా. ప్యాకేజీని ఆహ్వానించి తర్వాత ప్లేటు ఫిరాయించారు. ఏపీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారా? అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. నాలుగేళ్లు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు. మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలూ భాగం పంచుకున్నారు. వారికి తెలియకుండా ఏమీ జరగలేదు. కేంద్రంలో జరిగిన అన్ని వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం ఉంది. నాలుగేళ్ల తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటే ఎలా? ఎవరు నమ్ముతారు? ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గెలుస్తుంది. ‘సత్యం’ కేసులో బాబు పాత్రను బయటపెట్టింది నేనే సత్యం రామలింగరాజు కంపెనీలో గూడుపుఠాణీ జరుగుతోందని.. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో సరైన పత్రాలు చూపించకుండా రూ.కోట్ల డిపాజిట్లు వేసినట్టు ఐటీ శాఖ గుర్తించిందని పేర్కొంటూ 2003 ఆగస్టు 18న సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా)కి లేఖ రాశాను. లోక్‌సభలోనూ ఇదే విషయాన్ని నేను లేవనెత్తాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సత్యం కంపెనీ యజమాని రామలింగరాజు మధ్య ఉన్న సంబంధాలను ప్రస్తావించాను. ‘సత్యం’ కుంభకోణానికి బీజాలు పడుతున్న దశలో నేను లోక్‌సభలో ప్రస్తావించాను. విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా.. ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. విచారణ జరగకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అడ్డుపడ్డారు. స్కాముల చంద్రబాబు గురించి తొలుత హెచ్చరించింది నేనే. వైఎస్సార్ గొప్పనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నేను కూడా ఎంపీగా ఉన్నా. ఆయనతో నాకు పరిచయం ఉంది. గొప్ప నాయకుడు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మనిషి. మాయావతి పోటీలో ఉన్నా.. ఓట్లు చీలవు ‘దళితుల ఓట్లు చంద్రబాబుకు వెళ్లవు. దళితుల అభ్యున్నతికి ఆయన ఏం చేశారని వారంతా ఓట్లేస్తారు? కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు. మాయావతి ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు పెట్టు కుని పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి దళితుల ఓట్లు పడవు. చివరకు మాయావతి పోటీలో ఉన్నా.. దళితుల ఓట్లు చీలవు. టీడీపీకి గట్టిపోటీ ఇస్తున్న పార్టీ (వైఎస్సార్ సీపీ)కే దళితులు ఓట్లేస్తారు.’ ఐటీ దాడులంటే భయమెందుకు? ఆదాయపు పన్ను కట్టలేదనే అనుమానం ఉంటే ఐటీ అధికారులు దాడులు చేస్తారు. అది వారి డ్యూటీ. ఐటీ దాడులకు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు. ఆదాయపు పన్ను చెల్లించి ఉంటే, వ్యాపారాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఐటీ శాఖకు చూపించి ఉంటే.. ఇక భయమెందుకు? ప్రభుత్వ ప్రతినిధిగా చెబుతున్నా.. టీడీపీ వ్యాపారుల (నాయకుల)పై జరుగుతున్న ఐటీ దాడులకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ముఖ్యమంత్రి ధర్నా ఎలా చేస్తారు? పన్నులు చెల్లించని వ్యాపారుల మీద ఐటీ అధికారులు దాడులు చేయకుండా ఉండాలంటే.. పన్నులు సక్రమంగా చెల్లించమని చంద్రబాబు వారి పార్టీ నాయకులకు సూచిస్తే సరిపోతుంది. -
షాకింగ్; కేంద్ర మంత్రి చెంప చెళ్లు
థానే: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలేకి మహారాష్ట్రలోని అంబర్నాథ్ పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి ఓ అగంతకుడు ఆయనపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌నాథ్‌లో జరిగిన ఓ సభలో పాల్గొన్న అథవాలే.. కార్యక్రమం ముగిశాక కార్యకర్తలతో ముచ్చటించడం కోసం వేదిక కిందకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అథవాలే వైపు దూసుకొచ్చిన ఓ యువకుడు ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. అంతేకాకుండా ఆయనను తోసివేయడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అథవాలే భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆవేశంలో ఆర్పీఐ కార్యకర్తలు నిందితుడిపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా గుర్తించారు. కాగా, ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఈ షాకింగ్ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత అథవాలే ముంబైకి వెళ్లిపోయారు. అథవాలేపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో ముంబైలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఈ ఘటనపై ఆర్పీఐ నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. దీని వెనుక ఉన్నావారిని తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అథవాలేపై దాడికి నిరసనగా ఆదివారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. -
కాంగ్రెస్‌కు ‘మోదీ’ ప్రచారం
రాయ్‌పూర్: ప్రధాని మోదీ వేషధారణలో ఉన్న ఈ వ్యక్తి పేరు అభినందన్ పాఠక్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన గతంలో ఎన్డీయే భాగస్వామ్య రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉండేవారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు అమలవ్వక పోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడు పాఠక్‌తో ఇలా ఫొటో తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం వచ్చింది. -
నేడే ఆఖరు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభ, శాసనసభ స్థానాలకు నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగియనుంది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం వరకు అసెంబ్లీ స్థానాలకు 48, పార్లమెంట్ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు వచ్చాయి. ఏడో రోజైన మంగళవారం అసెంబ్లీ స్థానాలకు 45, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మంగళవారం రెండు, పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు పది అసెంబ్లీ స్థానాలకు 93, రెండు పార్లమెంట్ స్థానాలకు 10 నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి సిడాం గణపతి, మరో స్వాతంత్ర అభ్యర్థి ముసలి చిన్నయ్య ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కాల్వల సంజీవ్ నామినేషన్ వేయగా, బీఎస్పీ నుంచి పి. శంకర్ లాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఏడో రోజు నామినేషన్లు ఇలా.. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఏడో రోజైన మంగళవారం 45 నామినేషన్లు వచ్చాయి. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 4, చెన్నూర్‌కు 4, బెల్లంపల్లికి 9, మంచిర్యాలకు 4, ఆసిఫాబాద్‌కు 4, ఖానాపూర్‌కు 1, ఆదిలాబాద్‌కు 8, బోథ్‌కు 2, నిర్మల్‌కు 4, ముథోల్ నియోజకవర్గానికి 5 నామినేషన్లు వచ్చాయి. సిర్పూర్‌కు స్వతంత్ర అభ్యర్థి మోబినొద్దీన్, బీఎస్పీ నుంచి కోనేరు కోనప్ప, టీడీపీ నుంచి గొల్లపల్లి బుచ్చిలింగం, బీఎస్పీ నుంచి కోనేరు వంశీకృష్ణ నామినేషన్లు వేశారు. చెన్నూర్‌కు స్వతంత్ర అభ్యర్థి ఓ. శ్రీనివాస్, ఆర్పీకే నుంచి సోగల సంజీవ్, టీఆర్ఎస్ నుంచి నల్లాల ఓదేలు, స్వతంత్ర అభ్యర్థి బిరుదుల ప్రదీప్ నామినేషన్ వేశారు. బెల్లంపల్లి స్థానానికి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు రత్నం, శ్రీకాంత్, అంబాల మహేందర్, పెరుగు రాందాస్, బడికెల సంపత్‌కుమార్, మొగురం కన్నయ్యలు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకల వెంకటేశం, బీజేపీ నుంచి గందం రమేష్, టీడీపీ నుంచి శలం రాజలింగు, ఏఐఎఫ్బీ నుంచి బి.మధులు నామినేషన్లు వేశారు. మంచిర్యాలకు బీజేపీ నుంచి ఎం. మల్లారెడ్డి, జి. వెంకటానంద్ కృష్ణారావులు, స్వతంత్ర అభ్యర్థిగా బి. మల్లేష్, టీడీపీ నుంచి బి. రఘునందన్‌లు నామినేషన్లు వేశారు. చెన్నూర్‌కు టీడీపీ నుంచి ఎం. సరస్వతీ, రాథోడ్ చారులత, ఆత్రం భగవంత్‌రావులు, ఎంఎస్పీ నుంచి కోట్నాక్ విజయ్‌కుమార్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. ఖానాపూర్‌కు టీఆర్ఎస్ నుంచి చౌహాన్ ప్రేమలత నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌కు టీడీపీ నుంచి మునిగెల నర్సింగ్, ఐయూఎంఎల్ నుంచి మహ్మద్ రఫీక్, టీఆర్ఎస్ నుంచి జోగురామన్న, కాంగ్రెస్ నుంచి భార్గవ్‌దేశ్‌పాండే, బీఎస్పీ నుంచి భూమారెడ్డి, పాటిల్ కమల, బీజేపీ నుంచి పాయల శంకర్, ఆర్కేసీపీ నుంచి విఠల్‌లు నామినేషన్లు వేశారు. బోథ్‌కు టీడీపీ నుంచి సోయం బాపురావు, టీఆర్ఎస్ నుంచి సబావత్ రాములు నాయక్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. నిర్మల్‌కు టీడీపీ నుంచి ఎం. యాసిన్‌బేగ్, భూషన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా కె. ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ నుంచి కూచాడి శ్రీదేవిలు నామినేషన్లు వేశారు. ముథోల్‌కు టీడీపీ నుంచి ఓంప్రకాష్ లడ్డా, టీడీపీ నుంచి ఎల్. నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా లాలుతాటివార్, ఆర్పీఐ నుంచి కాంబ్లే దిగంబర్, శివసేన నుంచి టి. పండిత్రావులు నామినేషన్లు వేశారు.