సాక్షి, అమరావతి : ఆయనో దళిత ఉద్యమకారుడు. కార్మిక సంఘం నాయకుడిగా.. జర్నలిస్టుగా.. రాజకీయ నేతగా.. అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. వైఎస్సార్ సీపీ విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబే కదా. ప్యాకేజీని ఆహ్వానించి తర్వాత ప్లేటు ఫిరాయించారు. ఏపీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారా? అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. నాలుగేళ్లు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు.
మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలూ భాగం పంచుకున్నారు. వారికి తెలియకుండా ఏమీ జరగలేదు. కేంద్రంలో జరిగిన అన్ని వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం ఉంది. నాలుగేళ్ల తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటే ఎలా? ఎవరు నమ్ముతారు? ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గెలుస్తుంది.
‘సత్యం’ కేసులో బాబు పాత్రను బయటపెట్టింది నేనే
సత్యం రామలింగరాజు కంపెనీలో గూడుపుఠాణీ జరుగుతోందని.. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో సరైన పత్రాలు చూపించకుండా రూ.కోట్ల డిపాజిట్లు వేసినట్టు ఐటీ శాఖ గుర్తించిందని పేర్కొంటూ 2003 ఆగస్టు 18న సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా)కి లేఖ రాశాను.
లోక్‌సభలోనూ ఇదే విషయాన్ని నేను లేవనెత్తాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సత్యం కంపెనీ యజమాని రామలింగరాజు మధ్య ఉన్న సంబంధాలను ప్రస్తావించాను. ‘సత్యం’ కుంభకోణానికి బీజాలు పడుతున్న దశలో నేను లోక్‌సభలో ప్రస్తావించాను. విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా.. ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. విచారణ జరగకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అడ్డుపడ్డారు. స్కాముల చంద్రబాబు గురించి తొలుత హెచ్చరించింది నేనే.
వైఎస్సార్ గొప్పనేత
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నేను కూడా ఎంపీగా ఉన్నా. ఆయనతో నాకు పరిచయం ఉంది. గొప్ప నాయకుడు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మనిషి.
మాయావతి పోటీలో ఉన్నా.. ఓట్లు చీలవు
‘దళితుల ఓట్లు చంద్రబాబుకు వెళ్లవు. దళితుల అభ్యున్నతికి ఆయన ఏం చేశారని వారంతా ఓట్లేస్తారు? కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు. మాయావతి ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు పెట్టు కుని పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి దళితుల ఓట్లు పడవు. చివరకు మాయావతి పోటీలో ఉన్నా.. దళితుల ఓట్లు చీలవు. టీడీపీకి గట్టిపోటీ ఇస్తున్న పార్టీ (వైఎస్సార్ సీపీ)కే దళితులు ఓట్లేస్తారు.’
ఐటీ దాడులంటే భయమెందుకు?
ఆదాయపు పన్ను కట్టలేదనే అనుమానం ఉంటే ఐటీ అధికారులు దాడులు చేస్తారు. అది వారి డ్యూటీ. ఐటీ దాడులకు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు. ఆదాయపు పన్ను చెల్లించి ఉంటే, వ్యాపారాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఐటీ శాఖకు చూపించి ఉంటే.. ఇక భయమెందుకు? ప్రభుత్వ ప్రతినిధిగా చెబుతున్నా.. టీడీపీ వ్యాపారుల (నాయకుల)పై జరుగుతున్న ఐటీ దాడులకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ముఖ్యమంత్రి ధర్నా ఎలా చేస్తారు? పన్నులు చెల్లించని వ్యాపారుల మీద ఐటీ అధికారులు దాడులు చేయకుండా ఉండాలంటే.. పన్నులు సక్రమంగా చెల్లించమని చంద్రబాబు వారి పార్టీ నాయకులకు సూచిస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment