
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తోటి కేబినెట్ మంత్రి, రామ్‌దాస్ అథవాలేను ఉద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి కేంద్రంలో తమ ప్రభుత్వం(బీజేపీ) వస్తుందో రాదో తెలియదు కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే మాత్రం కచ్చితంగా కేంద్రమంతి అవుతారనే హామీ ఇవ్వగలనని చమత్కరించారు.
ఈ మేరకు నాగ్‌పూర్‌లోజరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. వివిధ ప్రభుత్వాలలో అథవాలే కేబినెట్ పదవులు చేపట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో స్టేజ్‌పై అథవాలే కూడా ఉండటం గమనార్హం. అనంతరం అథవాలేతో సరదాగా నవ్వుతూ తాను జోక్ చేశానని చెప్పుకొచ్చారు.అథవాలే కూడా నవ్వులు చిందించారు.
ప్రస్తుతం గడ్కరీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా, రామ్‌దాస్ అథవాలే వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తన పరంపరను కొనసాగిస్తానని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా భాగం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడనుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆర్‌పీఐ(ఏ) కనీసం 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు అథవాలే పేర్కొన్నారు.. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర నాగ్‌పూర్, ఉమ్రేడ్ (నాగ్‌పూర్), యావత్‌మాల్‌లోని ఉమర్‌ఖేడ్, వాషిమ్‌తో సహా విదర్భలో మూడు నుంచి నాలుగు స్థానాలను అడుగుతామని చెప్పారు.కూటమిలో భాగమైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు తమ కోటా నుంచి తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని అన్నారు.
చదవండి: ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్‌లో మార్పులు
Comments
Please login to add a commentAdd a comment