అమ్మ మినరల్ వాటర్
సాక్షి, చెన్నై : అమ్మ మినరల్ వాటర్ క్యాన్ పథకానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలి విడతగా చెన్నైలోని పేద కుటుంబాలకు రోజుకు 20 లీటర్ల చొప్పున శుద్ధీకరించిన నీటిని అందించనున్నారు. ఉచితంగా 20 లీటర్ల క్యాన్ల ద్వారా ఈ నీటిని పంపిణీ చేయడానికి నిర్ణయించారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చేనా అన్న ప్రశ్న బయలు దేరింది. రాష్ట్రంలో తాగు నీటి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మినహా తక్కిన పట్టణ, నగరాల్లో శుద్ధీకరించ బడ్డ వాటర్ క్యాన్ల మీద ప్రజలు ఆధార పడక తప్పడం లేదు.
ఇక, రాజధాని నగరం చెన్నై , సబర్బన్లలో ప్రతి ఇంటా శుద్ధీకరించ బడ్డ నీటిని ఉపయోగించుకోవాల్సిందే. కొన్ని ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైలు ఉన్నా, మిగిలిన వాళ్లు వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తూ వస్తున్నారు. దీంతో నగర, శివారుల్లో కోకొల్లలుగా మినరల్ వాటర్ క్యాన్ల పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. 20 లీటర్ల క్యాన్ నీటిని రూ. ముప్పైకి పైగానే విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలి కాలంగా అమ్మ నినాదంతో సరికొత్త పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్న ప్రభుత్వం, తాజాగా వాటర్ క్యాన్ల మీద దృష్టి పెట్టింది.
అమ్మ పేరుతో ఇన్నాళ్లు అమల్లోకి వచ్చిన పథకాలన్నీ రాయితీతో, చౌక ధరతో కూడుకున్నది. అయితే, తాజాగా అమ్మ ఉచిత మీటర్ వాటర్ క్యాన్ల పథకం అమల్లోకి తెచ్చేందుకు ఆగమేఘాలపై అధికార వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. ఇందుకు తగ్గ ఆదేశాలను శనివారం సీఎం జయలలిత అధికారులకు జారీ చేశారు. అయితే, ఎన్నికల నగారా తేదీ సమీపిస్తున్న సమయంలో పనులు త్వరితగతిన ముగిసేనా, ఈ పథకం ఏ మేరకు అమల్లోకి వస్తుందో అన్న ప్రశ్న సర్వత్రా బయలు దేరి ఉన్నది. ఇక, ఇది వరకే అమ్మ మినరల్ వాటర్ పేరిట లీటరు బాటిల్ రూ. పదికి విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
అమ్మ ఉచిత మినరల్ వాటర్: సీఎం జయలలిత జారీ చేసిన ఆదేశాల మేరకు అమ్మ మినరల్ వాటర్ పథకం ప్రకటనను సమాచార శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో సురక్షిత మంచినీరు ప్రజలకు అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం ఉమ్మడి తాగు నీటి పథకాలను రూ. 7324 కోట్లతో అమలు చేసి ఉన్నదని వివరించారు. అలాగే, మరో రూ. 6602 కోట్లతో మరికొన్ని పథకాల పనులు సాగుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని పేద , మధ్యతరగతి వర్గాలకు శుద్ధీకరించ బడ్డ నీటిని 20 లీటర్ల క్యాన్ల ద్వారా అందించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. తొలి విడతగా చెన్నైలో ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గ ఏర్పాట్లును వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
చెన్నైలో ఎంపిక చేసిన వంద ప్రదేశాల్లో , గంటకు రెండు వేల లీటర్ల నీటి శుద్ధీకరణ లక్ష్యంగా ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. స్మార్ట్ కార్డుల ద్వారా ఉచితంగా ఈ నీటి క్యాన్లను పొందేందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేయనున్నామన్నారు. అర్హులైన వారికి స్మార్ట్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్టు సూచించారు. ఒక్కో కుటుంబానికి రోజుకు 20 లీటర్ల వాటర్ క్యాన్ అందించనున్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందుగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వెనుకబడిన తరగతులు, మైనారిటీ విభాగం నేతృత్వంలో రూ. 66 కోట్లతో నిర్మించిన హాస్టళ్లను సీఎం జయలలిత వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు.