‘అనాబెల్’ ఆవహించింది..!
అది 1970. డొన్నా, ఆమె ఫ్రెండ్ ఆంజీ తమ ఫ్లాట్‌లో నిద్రపోతున్నారు. ఇంట్లో ఓ మూలన ఉన్న బొమ్మ సడెన్‌గా వాళ్ల మీద పడింది. గాలికి కాస్త జరిగి కింద పడిందేమో అనుకున్నారు. తర్వాతి రోజు ఆ బొమ్మ.. ఉన్న చోటే అటు ఇటూ కదులుతూ కనిపించింది. మరోరోజు ఉదయం ఒక చోట పెడితే సాయంత్రం ఇంకో చోట కనపడింది. ‘హెల్ప్ మీ’ అంటూ చిన్న చిన్న కాగితం ముక్కలు కనిపిస్తూ ఉండేవి. అవెక్కడివో మాత్రం అర్థమయ్యేది కాదు.
ఈ బొమ్మ వల్లే ఇదంతా జరుగుతుందని నమ్మారు డొన్నా, ఆంజీ. ఇలాంటి శక్తులను పట్టుకునే వ్యక్తిని పిలిపిస్తే, బొమ్మలోకి ‘అనాబెల్’ అనే అమ్మాయి ఆత్మ దూరిందని తేల్చి చెప్పారు. ముందు దాన్ని వదిలించాలి అనుకున్నారు. ఆ తర్వాత తమ వల్ల కాదని అర్థమయ్యాక ఎడ్, లొరెన్ వారెన్కు అప్పగించేశారు. వాళ్లు ఈ బొమ్మను అత్యంత జాగ్రత్తగా, మంత్రం చదివిన నీళ్ల చుట్టూ ఒక బాక్స్‌లో పెట్టి మ్యూజియంలో పెట్టేసుకున్నారు.
అమెరికాలోని వారెన్స్ అక్కల్ట్ మ్యూజియంలో ఇప్పటికీ ఆ బొమ్మ అలాగే ఉంది. దాన్ని ముట్టుకోవడానికి కూడా జంకుతూ ఉంటారంతా! ఈ బొమ్మ కథేదో కొత్తగా కనిపించి కంజూరింగ్ సిరీస్‌లో భాగంగా ‘అనాబెల్’ అనే సినిమా తీశారు. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ ‘అన్నాబెల్లె 2’ కూడా వచ్చింది. అదీ సూపర్ హిట్ అనిపించుకుంటోంది. మ్యూజియంలో బాక్స్ లోపల ఉండే బొమ్మ చూడడానికి పెద్దగా భయపెట్టేలా ఏమీ ఉండదు. కాకపోతే దాని గురించి తెలిసిన వాళ్లను అడిగితే చెప్తారు...అది ఎంతలా భయపెడుతుందో!!