anatagiri
-
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’
అనంతగిరి: బాధ్యతగల ఓ ప్రభుత్వోద్యోగి ఓ వ్యక్తిని ఎయిర్‌గన్‌తో బెదిరించిన సంఘటన శుక్రవారం రాత్రి వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పట్టణంలోని సాకేత్‌నగర్‌లో నివసించే షేక్ ఫయాజ్ అహ్మద్ కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కమలానగర్‌కు చెందిన ప్రణీత్‌కుమార్ అనే వ్యక్తి గౌలికార్ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన కోసం ఆగగా.. ఫయాజ్ అహ్మద్ వచ్చి పరుష పదజాలంతో తిట్టాడు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’అంటూ కారులో నుంచి తుపాకీ తీసి బెదిరించాడు. దీంతో ప్రణీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఫయాజ్ అహ్మద్ ఇంట్లో వెతకగా ఎయిర్‌గన్‌తో పాటు తల్వార్, కత్తులు దొరికాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్, మారణాయుధాలు ఎక్కడివని ఆరా తీశారు. అతని ఇండికా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించామని సీఐ రాజశేఖర్ తెలిపారు. కాగా, ఫయాజ్ అహ్మద్ వద్ద అసలైన తుపాకీ ఉందని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తు్తన్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. చదవండి: Banjara Hills: సహజీవనం.. విషాదం -
'హైదరాబాద్ రాజధానిగా ప్రజలు కోరుతున్నారు'
అనంతగిరి:: పది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్న తెలంగాణనే ప్రజలు కోరుతున్నారని ఏబీవీపీ వికారాబాద్ భాగ్ కన్వీనర్ రాజు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ పట్టణంలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సీమాంధ్ర పెట్టుబడిదారుల లాబీయింగ్‌కు తలొగ్గి ఒకవేళ హైదరాబాద్ విషయంలో మార్పు జరిగితే సహించేది లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఆ నగరాన్ని యూటీ చేస్తే ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ నోట్‌ను వెంటనే కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును తప్పకుండా ఆమోదించాలని డిమాండ్ చేశారు. వెయ్యి మంది విద్యార్థుల త్యాగఫలమే తెలంగాణ అని చెప్పారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ సంఘటన కార్యదర్శి కళ్యాణ్, పట్టణ కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, నవీన్, బాలక్రిష్ట, నాగేష్, మణికంఠ, అంజి, నరేష్, వినోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో అంబేద్కర్చౌస్తా కిక్కిరిసిపోయింది.