అనంతగిరి:: పది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్న తెలంగాణనే ప్రజలు కోరుతున్నారని ఏబీవీపీ వికారాబాద్ భాగ్ కన్వీనర్ రాజు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ పట్టణంలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పలు కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సీమాంధ్ర పెట్టుబడిదారుల లాబీయింగ్‌కు తలొగ్గి ఒకవేళ హైదరాబాద్ విషయంలో మార్పు జరిగితే సహించేది లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఆ నగరాన్ని యూటీ చేస్తే ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ నోట్‌ను వెంటనే కేంద్ర క్యాబినెట్‌లో ప్రవేశపెట్టాలన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును తప్పకుండా ఆమోదించాలని డిమాండ్ చేశారు. వెయ్యి మంది విద్యార్థుల త్యాగఫలమే తెలంగాణ అని చెప్పారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ సంఘటన కార్యదర్శి కళ్యాణ్, పట్టణ కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, నవీన్, బాలక్రిష్ట, నాగేష్, మణికంఠ, అంజి, నరేష్, వినోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో అంబేద్కర్‌చౌస్తా కిక్కిరిసిపోయింది.