ఎస్సీ, ఎస్టీరుణాలు ఎక్కడ?
ఒంగోలు టౌన్ : ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 2013-2014 ఏడాదికి సబ్సిడీ రుణాలు అందించాలని.. జీఓ నం 101ని సవరించి అర్హులైన వారందరికీ బ్యాంకు అనుమతి లేని రుణాలు ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రకాశం భవనం వద్ద నిర్వహించిన ధర్నాకు జిల్లా అధ్యక్షుడు అట్లూరి రాఘవులు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 13 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ 27వేల 28 మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సి ఉందని వివరించారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 786 మందికి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 486మందికి రుణాలు ఇవ్వాలని చెప్పారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థారుు అధికారులు పంపించిన అర్జీలను ఉన్నతాధికారులు తిరిగి వెనక్కు పంపించడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు.
దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టంలో భాగంగా 50 యూనిట్లలోపు విద్యుత్ వాడుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చినా బిల్లులు కట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు వెంగళరావు, మాలమహానాడు నాయకుడు దాసరి శివాజీ తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.