నేటి నుంచి పాడి పశువుల పోటీలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ద్వారకాతిరుమలలో గురువారం నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పాడి పశువుల పోటీలు నిర్వహించనున్నట్టు పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.జ్ఞానేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పశు సంవర్థకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పాల పోటీలు, పశుజాతి అందాల పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాల పోటీలకు ముర్రా జాతి గేదెలు, ఒంగోలు జాతి ఆవులు, గిర్, పుంగనూరు, షాహివాన్ తదితర దేశవాళీ జాతుల గేదెలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. పోటీలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ముర్రా జాతి దున్నపోతులు, పెయ్యలకు, ఒంగోలు జాతి పెయ్యలు, గిత్తలకు మాత్రమే అందాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి సుమారు 200 పశువులు పాల పోటీల్లో, మరో 200 పశువులు అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.